అడవి బిడ్డలకు జగన్‌ అభయం | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డలకు జగన్‌ అభయం

Published Thu, Nov 24 2016 12:38 AM

adavibiddalaku jagan abhayam

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల నిర్వాసితులైన అడవి బిడ్డల సమస్యలను అసెంబ్లీలో చర్చించి.. పరిష్కారానికి కషి చేస్తామని ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభయం ఇచ్చారు.  వైఎస్సార్‌ సీపీ ఎస్టీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను బుధవారం రాజమండ్రిలో కలిశారు. పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురయ్యే 8 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినా.. ఇప్పటికీ చాలా మందికి ఇళ్లు కట్టించి ఇవ్వలేదని బాలరాజు వివరించారు. కొందరికి ఇళ్లు నిర్మించినా కనీస సౌకర్యాలులేవని వైఎస్‌ జగన్‌ దష్టికి తీసుకెళ్లారు. పోలవరం మండలం మూలలంకలో రైతుల అభీష్టానికి విరుద్ధంగా డంపింగ్‌ యార్డు కోసం అధికారులు బలవంతంగా భూములను లాక్కుంటున్నారని వివరించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతానికి ఐదారు కిలోమీటర్ల దూరంలోని రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు మేలుచేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. డంపింగ్‌ యార్డు కారణంగా పోలవరం గ్రామస్తులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయాన్ని వివరించారు. వీటిపై జగన్‌మోహనరెడ్డి స్పందిస్తూ నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వారి వాణి వినిపిస్తామని హామీ ఇచ్చారు.
 
  

Advertisement
Advertisement