మళ్లీ తెరపైకి అర్బన్‌ మండలం | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి అర్బన్‌ మండలం

Published Tue, Aug 2 2016 12:30 AM

మళ్లీ తెరపైకి అర్బన్‌ మండలం

కడప సెవెన్‌రోడ్స్‌:

జిల్లాలో అర్బన్‌ మండలం ఏర్పాటు విషయం మళ్లీ తెర పైకి వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్లు, అర్బన్‌ మండలాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండటమే ఇందుకు కారణం. జనాభాతోపాటు పెరుగుతున్న అవసరాలు, సిబ్బంది పనిభారం దృష్ట్యా పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా బద్వేలు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు చాలా రోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇక 2007 సెప్టెంబరు 1న కడప అర్బన్‌ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ నంబర్‌: 224 జారీ చేసింది. అయితే 2002 ఆగస్టు 1 నుంచే డి–లిమిటేషన్‌ యాక్టు–2000 అమలులో ఉండేది. పరిపాలన యూనిట్‌లో మార్పులు చేయరాదని ఈ చట్టం పేర్కొనడంతో కడప అర్బన్‌ మండల ఆవిర్భావం జరగలేదు. కానీ అర్బన్‌ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్‌ అసిస్టెంట్, సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. సాంఘిక సంక్షేమం, భూసేకరణ సబ్జెక్టులను అర్బన్‌ తహసీల్దార్‌కు కేటాయించారు. ఆ తర్వాత డి–లిమిటేషన్‌ ప్రక్రియ ముగిసింది.
మిగతా ప్రాంతాల్లో ఏర్పడినా..
తిరుపతి, కాకినాడ, విశాఖపట్టణంలలో అర్బన్‌ మండలాలు ఆవిర్భవించినప్పటికీ కడపలో మాత్రం ఏర్పాటు కాలేదు. 2009 సాధారణ ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడం, జిల్లా అధికారుల నిర్లిప్తత ఇందుకు కారణాలు. అలాగే అర్బన్‌ తహసీల్దార్లుగా నియమించబడ్డ వ్యక్తులు కూడా తమ సొంత అవరాలను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ మండల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. అర్బన్‌ సిబ్బంది జీతాలు మాత్రం తీసుకుంటూ కడప తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. అప్పట్లో అర్బన్‌ తహశీల్దార్‌గా మహాలక్ష్మి నియమితులయ్యారు. ఆమె భర్త హైకోర్టులో అడ్వకేట్‌గా ఉండడంతో ఆమె ఇక్కడ పని చేయకుండా డిప్యుటేషన్‌పై హైకోర్టు లైజన్‌ అధికారిగా వెళ్లారు. దీంతో అర్బన్‌ మండల కార్యాలయ ఏర్పాటు అంశం మరుగన పడింది. ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా మహాలక్ష్మిని రాజంపేట కేఆర్‌ఆర్‌ విభాగానికి బదిలీ చేసి, కడప ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి బీఏ వేదనాయకంను కడపలో అర్బన్‌ తహసీల్దార్‌గా నియమించారు. ఆయన ఇప్పుడు తనకు అర్బన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో అందరూ దాదాపుగా మరిచిపోయిన ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కడప ఆర్డీఓ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్డీఓ చిన్నరాముడు శనివారం తహసీల్దార్‌ రవిశంకర్‌రెడ్డిని పిలిపించి అర్బన్‌ మండల ఏర్పాటు అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే తహసీల్దార్‌ మాత్రం దీనిపై తన అయిష్టత వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారని తెలిసింది. అర్బన్‌ మండలం ఏర్పాటైతే తమ పరిధి, అజమాయిషీ తగ్గిపోతాయని భావించడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ అంశంపై ఆర్డీఓ చిన్నరాముడును ‘సాక్షి’ వివరణ కోరగా, తహసీల్దార్‌ నుంచి వివరాలు తెప్పించుకుని ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్‌కు పంపుతానని తెలిపారు.
పెరిగిన జనాభా–అవసరాలు
మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాలలో అర్బన్‌ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కడప పట్టణ జనాభా 60 వేలు మాత్రమే ఉండేది. కడప మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు విలీనం చేసి కార్పొరేషన్‌ హోదా కల్పించారు. నేడు నగర జనాభా మూడు లక్షలు దాటింది. జనాభాతోపాటు ప్రజల అవసరాలు కూడా బాగా పెరిగాయి. అందుకే చెమ్ముమియాపేటలో 2007లో రూరల్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని, అలాగే వివిధ పోలీసుస్టేషన్లు కూడా ఏర్పాటయ్యాయి. కానీ, కడప అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి మాత్రం మోక్షం లభించలేదు. తహసీల్దార్‌ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సకాలంలో పనులు జరగకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బందికి కూడా పనిభారం అధికంగానే ఉంది. ప్రభుత్వం కొత్త అర్బన్‌ మండలాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో 2007లోనే మంజూరైన కడప అర్బన్‌ మండలాన్ని ఇకనైనా అమలులోకి తేవాల్సిన అవసరం ఉంది. 

Advertisement
Advertisement