మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి | Sakshi
Sakshi News home page

మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి

Published Sun, Jul 24 2016 10:31 PM

communalism - Sakshi

ఒంగోలు టౌన్‌:   దేశంలో బీజేపీ ప్రేరేపిస్తున్న హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకికవాదులంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఎంవీఎస్‌ శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో భారతదేశ తత్వశాస్త్రంపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాదాన్ని బీజేపీ ముందుకు తీసుకెళ్తోందన్నారు. హిందూ మతోన్మాదం అనేది దేశ మూలాల్లోనే లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు దేశ చరిత్రను తిరగేస్తే హిందూ మతంలోగానీ, ఇతర మతాల్లోగానీ మత సహనం పాటించాలని చెప్పినవారే ఉన్నారని గుర్తు చేశారు. 
మతాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం కోసం మతోన్మాదాన్ని ప్రేరేపించడం సహించరానిదన్నారు. ఇతర మతాలకు వ్యతిరేకంగా మతోన్మాదాన్ని పోషించే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఉదారవాద ఆర్థిక విధానాలు అమలు జరుపుతున్న నేపథ్యంలో బహుళజాతి సంస్థలు, దేశానికి చెందిన బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడేవిధంగా పాలకులు విధానాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. కమ్యూనిస్టులు హిందూ మతానికి వ్యతిరేకం కాదని, హిందూ మతోన్మాదానికే వ్యతిరేకమని శర్మ స్పష్టం చేశారు. శిక్షణ తరగతులకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జాలా అంజయ్య ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. రాష్ట్ర నాయకులతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఎం జెండా ఆవిష్కరణ
రాష్ట్ర శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా స్థానిక సుందరయ్య భవన్‌లో సీపీఎం రాష్ట్ర నాయకుడు వై.సిద్దయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా కార్యకర్తలు మరింత మెరుగ్గా తయారయ్యేందుకు శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వాలు పరిష్కరించకుండా ప్రపంచీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తెరిగి నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement
Advertisement