Sakshi News home page

జగన్‌ పోరాటం.. బాధితుల్లో ఆత్మస్థైర్యం

Published Thu, Mar 23 2017 11:55 PM

జగన్‌ పోరాటం.. బాధితుల్లో ఆత్మస్థైర్యం - Sakshi

- ప్రతిపక్ష నేత అండతో అగ్రిగోల్డ్‌ బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు
- జిల్లా వ్యాప్తంగా  88,416 మంది బాధితులు
– వీరు డిపాజిట్‌ చేసిన సొమ్ము రూ.100 కోట్లకు పైనే
 – జిల్లాలో సంస్థకు భారీగా ఆస్తులు..అయినా బాధితులకు వేదన
– ఒత్తిడికి గురై 14 మంది మృతి


అనంతపురం అర్బన్‌ : ‘అగ్రిగోల్డ్‌’ సంస్థ ప్రకటనల హోరుకు జిల్లాలో అనేకమంది ఆకర్షితులయ్యారు. సంస్థను నమ్మి భారీఎత్తున డిపాజిట్లు చేశారు. ఆస్తులనూ కొనుగోలు చేశారు. అష్టకష్టాలు పడి కూడబెట్టిన సొమ్మును ఏదో ఒకరూపంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నది వారి భావన. ఈ క్రమంలోనే ‘అగ్రిగోల్డ్‌’ను నమ్మారు. అయితే..వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. జిల్లావ్యాప్తంగా 88,416 మంది ఖాతాదారులు నష్టపోయారు. న్యాయం కోసం బాధితులు వివిధ రూపాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధితులకు జగన్‌ అండగా నిలవడంతో  ప్రభుత్వం దిగొచ్చింది. న్యాయం చేస్తామని ప్రకటించింది.

జిల్లాలో 14 మంది మృతి
‘అగ్రిగోల్డ్‌’ వంచన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనై కొందరు ఏజెంట్లు గుండెపోటుతో, మరికొందరు మానసిక ఒత్తిడికి గురై మరణించారు. ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుత్తి పట్టణం కమతం వీధికి చెందిన రషీద్‌ అహమ్మద్, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పి.రాముడు, పూట్లూరు మండలం కడవకల్లుకు చెందిన పి.ప్రేమరాజు, రాయదుర్గం మండలం వడ్రవన్నూరుకు చెందిన కె.శివన్న, బ్రహ్మసముద్రం మండలం చలిమేపల్లికి చెందిన ఎన్‌.ఆంజనేయులు, ధర్మవరానికి చెందిన కె.చంద్రశేఖర్‌తో పాటు మరో ఏడుగురు మరణించారు. విడపనకల్లు మండలానికి చెందిన డి.రఫీ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

జిల్లాలో రూ.100 కోట్లకుపైనే వసూలు
    అగ్రిగోల్డ్‌ సంస్థకు జిల్లావ్యాప్తంగా 88,416 మంది ఖాతాదారులు ఉన్నారని, ఈ జాబితా సీఐడీ ఇచ్చిందేనని బాధిత ఏజెంట్లు చెబుతున్నారు. సంస్థకు ఖాతాదారులు డిపాజిట్‌ చేసిన మొత్తం రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. ఖాతాదారుల ఒత్తిడికి తట్టుకోలేక పలువురు ఏజెంట్లు ఊర్లు విడిచారని కూడా చెబుతున్నారు.

సంస్థకు  భారీ ఆస్తులు
    జిల్లాలో అగ్రిగోల్డ్‌ సంస్థకు భారీగా ఆస్తులు ఉన్నాయి. తొమ్మిది వెంచర్లు, 1,633.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూమిని సీఐడీ అటాచ్‌మెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు కళ్యాణదుర్గం మండలం కురాకులతోట రైల్వే గేటు దగ్గర, కూడేరు మండలం కమ్మూరు గేటు వద్ద, తాడిపత్రి వద్ద బుగ్గలింగేశ్వర వెంచర్,  గుంతకల్లు మండలం దోసలేడు వద్ద శ్రీ ఆంజేయ వెంచర్, కదిరి వద్ద శ్రీలక్ష్మినరసింహ వెంకటేశ్వర వెంచర్, పుట్టపర్తి వద్ద శ్రీసత్యసాయి వెంచర్, పుట్లురు మండలం కడవకల్లు వద్ద, లేపాక్షి వద్ద, ధర్మవరంలో వెంచర్‌లు ఉన్నాయి. వీటిలో చాలావరకు అగ్రిగోల్డ్‌ బినామీ సంస్థల పేరున ఉన్నట్లు   ఏజెంట్లు చెబుతున్నారు.

సంస్థకు ఉన్న వ్యవసాయ భూమి
    జిల్లాలో 14 చోట్ల 1,633.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. పుట్టూరు మండలం కడవకల్లు వద్ద 217.76 ఎకరాలు, తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి వద్ద 64.93 ఎకరాలు, నల్లచెరువు మండలం ఓరువాయి వద్ద 134.03 ఎకరాలు, తాడిపత్రి మండలం తలారి చెరువు వద్ద 77.405 ఎకరాలు, శెట్టూరు మండలం మలకలేడు వద్ద 119.67 ఎకరాలు, కామంతనహళ్లి వద్ద 181.59 ఎకరాలు, యాడికి మండలం నిట్టూరు వద్ద 63.40 ఎకరాలు, ముదిగుబ్బ మండలం ఎల్లారెడ్డి పల్లి వద్ద 46.47ఎకరాలు,  శింగనమల మండలం సుద్దనపల్లి వద్ద 234.92 ఎకరాలు, సలకం చెరువు వద్ద 88.97 ఎకరాలు, ఎస్‌.కొండాపురం వద్ద 85.44 ఎకరాలు, రోద్దం మండలంలో 102.915 ఎకరాలు, కగనగానపల్లి  మండలం ఎలకుంట వద్ద 77.76 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

జగన్‌ పోరాటంతోనే ప్రభుత్వంలో కదలిక
– వెంకటేశ్, బాధిత ఏజెంట్‌
    న్యాయం కోసం రెండేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.  బాధితులకు న్యాయం చేయలంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లేవనెత్తడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హామీ మేరకు న్యాయం చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తాం. మా తరఫున అసెంబ్లీలో పోరాటం చేయడమే కాకుండా, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ధైర్యం చెప్పిన ప్రతిపక్ష నేతకు కృతజ్ఞతలు.
––––––––––
ప్రతిపక్ష నేత అండగా నిలిచారు
– కృష్ణమూర్తి, బాధితుడు
    అగ్రిగోల్డ్‌ సంస్థ బాధితులకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అండగా నిలిచి అసెంబ్లీలో పోరాటం చేశారు. దీనివల్లే ప్రభుత్వంలో అంతోఇంతో చలనం వచ్చింది. ముఖ్యంగా చిన్న మొత్తం పొదుపు చేసిన ఖాతాదారులకు తక్షణం న్యాయం చేయాలి.  
–––––––––––––
మొదట్నుంచీ అండగా ఉన్నాం
 – వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే
    అగ్రిగోల్డ్‌ బాధితులకు మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ అండగా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చకు పట్టుబట్టాం. బాధితులు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు తెలిపాం. నేను, నరసరావు పేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ వెళ్లి బాధితులతో మాట్లాడాం. మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో బాధితులకు అండగా నిలబడి అసెంబ్లీలో పోరాడాం. రెండుసార్లు సభ వాయిదా వేశారు. మా ఒత్తిడితో చివరకు సీఎం దిగొచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement