నాణ్యమైన పొట్టేళ్లతో మంద అభివృద్ధి | Sakshi
Sakshi News home page

నాణ్యమైన పొట్టేళ్లతో మంద అభివృద్ధి

Published Wed, Dec 28 2016 10:06 PM

నాణ్యమైన పొట్టేళ్లతో మంద అభివృద్ధి - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : గొర్రెల పెంపకం, మంద అభివృద్ధి చెందాలంటే పొట్టేళ్ల ప్రాముఖ్యత తెలుసుకోవాలని పశుసంవర్ధక శాఖ అనంతపురం డివిజన్‌ సహాయ సంచాలకులు (ఏడీ) డాక్టర్‌ టి.శ్రీనాథాచార్‌ తెలిపారు. ప్రతి 25 గొర్రెలకు ఒక నాణ్యమైన విత్తనపు పొట్టేలు ఉండేలా కాపర్లు జాగ్రత్తలు తీసుకుంటే జీవాల సంఖ్య పెరుతుందని ఆయన వివరించారు.

పొట్టేళ్లను మారుస్తూ ఉండాలి...
మందలో పుట్టిన పొట్టేళ్లను ఎంపిక చేసుకోవడం సరికాదు. ఇతర ప్రాంతాల నుంచి నాణ్యమైన విత్తన పొట్టేళ్లను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని కూడా ప్రతి రెండు మూడేళ్లకు ఓసారి మారుస్తుండాలి. మందలో ఉన్నవాటినే తీసుకునే పద్ధతిని ‘ఇన్‌ బ్రీడింగ్‌’ అంటారు.దగ్గరి సంబంధమున్న గొర్రెలు, పొట్టేళ్ల  సంపర్కం వల్ల పుట్టిన పిల్లలు బలహీనంగా ఉంటాయి.  తక్కువ బరువుతో, అవిటితనంతో పుట్టే అవకాశం ఎక్కువ.  సంతానోత్పత్తికి పనికిరానివిగానూ, జన్యు సంబంధ లోపాలతో గాని, జాతి లక్షణాలు కోల్పోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకోసం పొట్టేళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పొట్టేళ్ల ఎంపిక..
నెల్లూరు గోధుమ, నెల్లూరు జోడిపి లాంటి జాతి లక్షణాలున్న పొట్టేళ్లు బాగుంటాయి. చక్కటి శరీర సౌష్టవం, పొడవు, ఎత్తు, బరువు ఉండే వాటిని ఎంచుకోవాలి.  కాలి గిట్టలు బాగుండాలి, చురుకుదనం కలిగి ఉండటం.  వృషణాలు రెండూ సమానంగా, వయస్సుకు సరిపడిన పరిమాణంలో ఉండాలి. పొట్టేళ్ల మందపై వాడేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.   మందలో ప్రతి 25–30 గొర్రెలకు ఒక పొట్టేలు చొప్పున  ఉండేలా చర్యలు తీసుకుంటే మంద ఉత్పత్తి  పెరుగుతుంది.   ప్రతి గొర్రె నుంచి అదనపు ఆదాయం ఉంటుంది.      మేలు జాతి విత్తనపు పొట్టేళ్లు మార్కెట్‌లో లభించడం కష్టంగా ఉంది. పొట్టేళ్ల మార్పిడికి పశుసంవర్ధకశాఖ   ప్రోత్సాహం ఇస్తోంది. దీనిని కాపర్లు వినియోగించుకోవాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement