వేరుశనగలో పొగాకు లద్దెపురుగు | Sakshi
Sakshi News home page

వేరుశనగలో పొగాకు లద్దెపురుగు

Published Wed, Feb 22 2017 11:43 PM

వేరుశనగలో పొగాకు లద్దెపురుగు - Sakshi

- సస్యరక్షణ చర్యలు చేపడితే ఫలితం
– ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి


అనంతపురం అగ్రికల్చర్‌ : రబీలో వేసిన వేరుశనగ పంటకు పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలుగజేస్తున్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సహదేవరెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగ, వరి, దానిమ్మ పంటలతో పాటు కోళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
+ వేరుశనగ పంట ప్రస్తుతం చాలా చోట్ల శాఖీయ దశ నుంచి ఊడలు దిగే దశలో ఉంది. ఈ సమయంలో పొగాకు లద్దె పురుగు ఆశించింది. నివారణ చర్యల్లో భాగంగా ఎకరా పొలంలో 30 ఆముదం మొక్కలు వేసుకోవాలి. లద్దె పురుగు గ్రుడ్లు లేదా లార్వాలు ఆముదం మొక్కలపై గుర్తించిన వెంటనే తీసి నాశనం చేయడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. గుడ్లు, పురుగులు చిన్నవిగా ఉన్నపుడు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకోవాలి. అలాగే ఎకరాకు 400 మి.లీ క్వినాల్‌ఫాస్‌ లేదంటే లీటర్‌ వేపనూనె 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎకరా పొలంలో 10 పక్షిస్థావరాలు ఏర్పాటు చేసుకుంటే పురుగు ఉనికి, ఉధృతి తెలుస్తుంది. ఎదిగిన లార్వాల నివారణకు ఎకరాకు 200 గ్రాములు థయోడికార్బ్‌ లేదా 200 మి.లీ నొవాల్యురాన్‌ లేదా 400 మి.లీ క్లోరోఫెనాఫేర్‌ లేదా  40 మి.లీ ఫ్లూమెండమైడ్‌ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే 5 కిలోలు వరి తవుడు+ అర కిలో బెల్లం+ 50 మి.లీ మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరోఫైరిపాస్‌+ 350 మి.లీ మిథోమిల్‌ ద్వారా విషపు ఎరలు తయారు చేసుకుని ఎకరా పొలంలో సాయంత్రం వేళల్లో చల్లుకోవాలి.

+ వరి పంటలో అక్కడక్కడ సుడిదోమ ఆశించింది. నివారణకు 1.6 మి.లీ బుఫ్రోపెజిన్‌ లేదా 2 మి.లీ ఇతోఫెన్‌ఫ్రోక్స్‌ లేదా 1.5 గ్రాములు అసిఫేట్‌ లేదా ఇమిడాక్లోప్రిడ్‌+ 0.25 గ్రాములు ఎథిప్రోల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో కాండం తొలిచే పురుగు కనిపిస్తోంది. నివారణకు 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్‌ లేదా 1.5 గ్రాములు అసిఫేట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. చిరుపొట్ట దశలో 4–జి గుళికలు ఎకరాకు 8 కిలోలు లేదా 3–జి గుళికలు ఎకరాకు 10 కిలోలు వాడాలి.
+ దానిమ్మ తోటల్లో బ్యాక్టీరియా మచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నందున 2.5 గ్రాములు సాఫ్‌ (12 శాతం కార్బండిజమ్‌+ 63 శాతం మాంకోజెబ్‌) లేదంటే 0.5 మి.లీ స్ట్రెప్టోసైక్లీన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

+ వేసవి ప్రారంభం కావడంతో కోళ్ల సంరక్షణ చర్యలు చేపట్టాలి. కోళ్ల ఫారాలలో నీటి తొట్టెలు, నీటిని సరఫరా చేసే పైపులను తడి గోనెపట్టలతో కప్పి ఎప్పటికప్పుడు నీరు చల్లగా ఉండేలా చూసుకోవాలి. రోజంతా కోడిపిల్లలకు తాగునీరు అందుబాటులో ఉంచాలి. గదిలో ఉష్ణోగ్రతల నియంత్రణకు ఫాగర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి. గది పైకప్పును తాటి, కొబ్బరి మట్టలు లేదా బోధ గడ్డితో కప్పుకుంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. గదిలో అమ్మోనియా వాసన రాకుండా తగినంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం అందించాలి.

Advertisement
Advertisement