అరటితో లాభాల బాటే ! | Sakshi
Sakshi News home page

అరటితో లాభాల బాటే !

Published Thu, Mar 2 2017 10:09 PM

అరటితో లాభాల బాటే ! - Sakshi

- తెగుళ్లపై జాగ్రత్త అవసరం
– ఆర్‌హెచ్‌టీఐ ప్రిన్సిపల్‌ చంద్రశేఖరగుప్తా

అనంతపురం అగ్రికల్చర్‌ : మార్కెట్‌లో అరటికి మంచి ధరలు వచ్చాయని ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం  (రీజనల్‌ హార్టికల్చర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌–ఆర్‌హెచ్‌టీఐ) ప్రిన్సిపల్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ గుప్తా తెలిపారు. పంటను కాపాడుకుంటే అరటి రైతులంతా లాభాలను పొందవచ్చని చెప్పారు. వేసవి ప్రారంభం కావడంతో ఉద్యాన పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యలు, నీటి ఎద్దడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

+ అరటి తోటలకు ఎరువులు ఇచ్చి నీటి తడులు ఇవ్వాలి. అక్కక్కడ దుంపకుళ్లు తెగులు ఆశించడంతో నష్టం జరిగే అవకాశం ఉంది. తెగులు ఆశించిన మొక్కలను దుంపలతో సహా తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తోట బయట నాశనం చేయాలి. మొక్క మొదళ్ల దగ్గర మట్టి తడిచేలా 20 నుంచి 25 గ్రాములు బ్లీచింగ్‌ పౌడర్‌ లీటర్‌ నీటికి కలిపి పోయాలి. పశువుల ఎరువులో వృద్ధి చేసిన ట్రైకోడెర్మావిరిడీ, సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ను మొక్క మొదళ్ల దగ్గర వేయాలి.

+ పిందె దశలో ఉన్న ద్రాక్ష తోటల్లో నత్రజని, పొటాష్‌ ఎరువులు వేస్తే పరిమాణం పెరుగుతుంది. బూడిద తెగులు ఆశించిన తోటల్లో కత్తిరింపులు చేసిన 100 రోజులు, 115 రోజులకు 0.5 మి.లీ అజాక్సిస్ట్రోబీన్‌ లేదా 0.5 గ్రాములు పైరోక్లోస్ట్రోబీన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పిండినల్లి నివారణకు 0.5 మి.లీ స్పైరోటెట్రామీట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి.
+ చీనీ, నిమ్మ తోటల్లో సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేయాలి. చెట్ల మొదళ్లకు బోర్టోపేస్టు పూయాలి. దీని వల్ల పేనుబంక, నల్లదోమ, తెల్ల పొలుసు పురుగులు, చెద పురుగులను నివారించుకోవచ్చు.

+ కళింగర, కర్భూజా, దోస విత్తనాలు మొలకెత్తి రెండు మూడు ఆకులు ఉన్నపుడు ఆకుముడుత పురుగు ఆశించకుండా ఎకరాకు 15 నుంచి 20 పసుపురంగు జిగురు అట్టలను పంట ఎత్తుకు సమానంగా ఏర్పాటు చేసుకోవాలి. అట్టలపై ఆకుముడుత రెక్కల పురుగులు కనిపిస్తే 2 మి.లీ ట్రైజోఫాస్‌ లేదా 0.4 మి.లీ అబామెక్టిన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Advertisement
Advertisement