సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడి | Sakshi
Sakshi News home page

సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడి

Published Tue, Mar 7 2017 10:42 PM

సమగ్ర యాజమాన్య పద్ధతులతో దిగుబడి - Sakshi

– ‘మహానంది’ ప్రధాన శాస్త్రవేత్త సుబ్రమణ్యం
అనంతపురం అగ్రికల్చర్‌ : పిందె, కాయలు రాలిపోకుండా మామిడి తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని కర్నూలు జిల్లా మహానంది ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కె.సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.చంద్రశేఖరగుప్త ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సేంద్రియ విభాగపు శాస్త్రవేత్త డాక్టర్‌ విజయశంకరబాబుతో కలిసి కె.సుబ్రమణ్యం రైతులకు అవగాహన కల్పించారు.

పిందెరాలకుండా జాగ్రత్తలు :
    జిల్లా వ్యాప్తంగా 40 వేల హెక్టార్లకు పైగా మామిడి తోటలు సాగవుతుండగా అందులో 28 నుంచి 30 వేల హెక్టార్ల తోటలు కాతకు వచ్చాయి. కొన్ని కాయ, మరికొన్ని పిందె, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత దశలో ఉన్నాయి. వాతావరణ పరిస్థితులకనుగుణంగా పూత, దిగుబడులు వస్తాయి. ద్విలింగ పుష్పాలు వస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. చాలా తోటల్లో పిందె, కాయలు రాలుతున్నట్లు సమాచారం. వీటి నివారణకు 1 మి.లీ ప్లానోఫిక్స్‌ 4.5 లీటర్ల నీటికి లేదంటే 1 గ్రాము 2–4–డీ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

తేనె మంచు, బూడిద తెగులు నివారణ :
    ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటలకు తేనె మంచు, బూడిద తెగులు ఆశించింది. పురుగులు రసం పీల్చడం వల్ల పూత రాలిపోవడం, దిగుబడులు తగ్గిపోతాయి.  చెట్ల మొదళ్లు, కాండానికి ఉన్న బెరడు వద్ద పురుగులు దాగి ఉంటాయి. మందులు పిచికారీ చేసే సమయంలో మొదళ్లు, కాండం బాగా తడిచేలా పిచికారీ చేస్తే పురుగులు నశిస్తాయి. బూడిద తెగులు, తేనె మంచు పురుగుల బెడద బాగా తగ్గాలంటే జూలై – ఆగస్టు నెలల్లో 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

అనంతరం నెల రోజుల తర్వాత మరోసారి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుత పూత, పిందె సమయంలో ఈ తెగుళ్ల నివారణకు ఘాటైన మందులు వాడకూడదు. ఈగల ద్వారా ఫలదీకరణ జరుగుతుంది. ఈ తెగుళ్ల నివారణకు ప్రస్తుతం 0.5 మి.లీ కాన్ఫిడార్‌ + 1 గ్రాము బావిస్టన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేసుకోవాలి. అలాగే 3 గ్రాములు ఫార్ములా–4 లీటర్‌ నీటికి కలిపి సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకుంటే కాయ నాణ్యత, రంగు, పరిమాణాం బాగా వస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement