లోతు దుక్కులతో లాభసాటి దిగుబడి | Sakshi
Sakshi News home page

లోతు దుక్కులతో లాభసాటి దిగుబడి

Published Mon, May 22 2017 12:31 AM

లోతు దుక్కులతో లాభసాటి దిగుబడి - Sakshi

- వర్షం పడిన ప్రాంతాల్లో దుక్కులు చేసుకోవాలి
- కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్‌ ఎం.జాన్‌సుధీర్‌


అనంతపురం అగ్రికల్చర్‌ : వర్షం కురిసిన ప్రాంతాల్లో పొలాలను బాగా దుక్కులు చేసుకుంటే వేసే పంటలను రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు. పశుసంపద తగ్గిపోవడం, ఆర్థిక పరిస్థితులు, వరుస పంట నష్టాలు... తదితర కారణాలతో ఇటీవల కాలంలో చాలా మంది రైతులు దుక్కులు చేసుకోవడం మానేశారన్నారు. వర్షం రాగానే నేరుగా విత్తనం వేసే పరిస్థితి ఉండటంతో త్వరగా బెట్టకు గురై పంట దిగుబడి తగ్గిపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు.

వేసవి దుక్కులు :
    చీడపీడలు, తెగుళ్ల నివారణకు పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, రసాయన పద్ధతులు, ఇతరత్రా సంక్లిష్ట పద్ధతులు పాటించడం కన్నా భౌతిక, యాంత్రిక పద్ధతులతో సాగు విధానమే ప్రధానం. ఖరీఫ్‌ పంట కోత లేదా రబీ పంట తర్వాత నెలల తరబడి భూమిని దున్నకుండా వదిలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేరుగా పంట విత్తుకోవడం మంచిది కాదు. వేసవిలో అడపాదడపా కురిసే వర్షాలను వినియోగించుకొని మెట్ట, బీడు భూములను దున్నుకోవడమే వేసవి దుక్కులుగా పిలుస్తారు. రకరకాల పరికరాలతో లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పొలాల్లో మట్టి కొట్టుకుపోకుండా, నేల కోతకు గురికాకుండా వాలు ప్రాంతానికి అడ్డంగా దున్నాలి. దీని వల్ల భూమికి నీరు, తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇది వేసే పంటలకు ఉపయోగంగా మారుతుంది. త్వరితగతిన పంటలు బెట్టకు గురికాకుండా కాపాడుకోవచ్చు.

ఇలా దున్నుకోవాలి :
    సాధారణంగా రోటావేటర్‌ లేదా కల్టివేటర్‌ ద్వారా దున్నితే 8 నుంచి 12 సెంటీమీటర్లు లోతు మాత్రమే దున్నొచ్చు.  సేద్యానికి వాడే గొర్రు, గుంటక, దంతెలు వంటి పరికరాలు 8 నుంచి 12 సెంటీ మీటర్ల వరకు చొచ్చుకుపోతాయి. వీటి ద్వారా పదే పదే సేద్యం చేస్తే లోపల ఉన్న గట్టిపొర (మొరము) ఏర్పడి నీటిని నిల్వ చేసుకునే శక్తి తగ్గిపోతుంది. అదే రెక్కనాగలి, పళ్లెపు నాగలి ఉపయోగిస్తే 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు దున్నవచ్చు. దీని వల్ల నేల బాగా గుల్లబారిపోతుంది. లేదంటే గుణపం నాగలితో ప్రతి మూడు అడుగులు లేదా ఒక మీటర్ల ఎడంలో దున్నినపుడు గట్టిపొరను చేధించవచ్చు.

దీని వల్ల తేమశాతం పెంచుకోవచ్చు. పంటలు లేని సమయంలో చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి కారణమయ్యే పురుగులు, శిలీంధ్రాలు భూమిలో నిద్రావస్థలో ఉంటాయి. ఎండాకాలంలో దున్నడం వల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటకు వచ్చి నశిస్తాయి. మే నెలల్లో చేయడం వల్ల పురుగులు, శిలీంద్రాలు ఎండవేడికి చనిపోవడం వల్ల తొలిదశలో పంటకు ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువ. చాలా రోజుల పాటు భూమిని ఖాళీగా వదిలేయడం వల్ల మొండిజాతి కలుపు మొక్కలుపెరిగి భూమిలో ఉన్న నీటిని, పోషకాలను తీసుకొని నిస్సారం చేస్తాయి. వేసవి దుక్కుల వల్ల ఇలాంటి కలుపు మొక్కలను నివారించుకోవడంతో పాటు గత పంట అవశేషాలు భూమిలో కలిసి భూసార పెరగడానికి దోహదం చేస్తుంది. దీని వల్ల సేంద్రియ కర్బనం శాతం పెరుగుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement