వేరుశనగకు జూలై అనుకూలం | Sakshi
Sakshi News home page

వేరుశనగకు జూలై అనుకూలం

Published Fri, May 26 2017 11:42 PM

వేరుశనగకు జూలై అనుకూలం - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : వర్షాధారంగా వేసే వేరుశనగ పంట సాగుకు జూలై అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. జూన్‌లో వేసుకుంటే ఆగస్టు నెలలో ఏర్పడే బెట్ట పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు.

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఎనిమిది లక్షల హెక్టార్లు కాగా అందులో ప్రధానపంట వేరుశనగ ఆరు లక్షల హెక్టార్లుగా ఉంది. మిగతా రెండు లక్షల హెక్టార్లలో కంది, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న, ఆముదం, వరి, పెసర, ఉలవ, అలసంద తదితర పంటలు వేసే అవకాశం ఉంది. అననుకూల వర్షాలు, మరికొన్ని కారణాల వల్ల పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉన్న వేరుశనగ ద్వారా ఏటా రైతులు నష్టపోతున్నారు. అయితే కొన్ని యాజమాన్య చర్యలు పాటిస్తే వేరుశనగ నుంచి మంచి పంట దిగుబడులు పొందవచ్చు.
+ వేరుశనగ జూన్‌లో సాగు చేయడం వల్ల ఆగస్టులో ఏర్పడే బెట్ట పరిస్థితుల వల్ల ఊడలు, కాయ ఊరే దశలో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. జూలైలో వేసుకోవడం వల్ల ఆగస్టులో బెట్ట ఏర్పడినా సెప్టెంబర్‌లో కురిసే వర్షాలకు పంట కోలుకుని మంచి పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు దృష్టిలో పెట్టుకుని వర్షాధారంగా వేరుశనగ జూలైలో వేసుకుంటే మేలు.

+ వేరుశనగ విత్తడానికి ‘అనంత’ గొర్రును వాడటం ద్వారా మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉంటుంది. దీని వల్ల చదరపు మీటరులో 33 మొక్కలు ఉంటాయి. ఎకరాకు 60 కిలోలు విత్తనం అవసరం. 7:1 లేదా 11:1 లేదా 15:1 నిష్పత్తిలో వేరుశనగ+కంది వేసుకుంటే మేలు. వేరుశనగ పొలం చుట్టూ నాలుగు సాళ్లు జొన్న లేదా సజ్జ వేసుకుంటే వైరస్‌ తెగుళ్లను అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 3 గ్రాములు డైథేన్‌ ఎం–45 లేదా 1 గ్రాము కార్బండిజమ్‌ లేదా 4 గ్రాములు ట్రైకోడెర్మావిరిడీ పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువు లాంటి సేంద్రియ పోషకాలతో పాటు 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్‌పాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపీ) ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన మేరకు జిప్సం, జింక్‌సల్ఫేట్, బోరాన్‌ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్‌) వేయాలి.

Advertisement
 
Advertisement