సమష్టి పోరాటమే శరణ్యం | Sakshi
Sakshi News home page

సమష్టి పోరాటమే శరణ్యం

Published Sun, Apr 16 2017 11:00 PM

సమష్టి పోరాటమే శరణ్యం - Sakshi

ప్రజా ఉద్యమాలను ఎవరూ ఆపలేరు 
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదరి‍్శ ముప్పాళ్ల 
భారీగా తరలివచ్చిన అగ్రిగోల్డ్‌ బాధితులు 
కాకినాడ క్రైం: ప్రజా ఉద్యమాలను పాలకులు ఎంత అణచివేయాలని ప్రయత్నించినా ఆపలేరని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పిలుపునందుకుని భారీ సంఖ్యలో బాధితులు కాకినాడలోని గాంధీభవన్‌కి తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌లో లక్షలాది మంది డిపాజిట్లు చేశారన్నారు. యాజమాన్యం మాటలు నమ్మిన ఏజెంట్లు తమ జీవితాన్ని పణంగా పెట్టి కోట్లాది డిపాజిట్లు చేయించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19.52 లక్షల మంది ఖాతాదారులు అగ్రిగోల్డ్‌లో పలు రకాల పథకాల్లో రూ. 3.965 కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో రూ.7,600 కోట్ల సేకరించినట్టు తెలిపారు.5 నుంచి 20 వేల లోపు 13 లక్షలు ఖాతాలుండగా, రూ. 1,182.17 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వృద్ధాప్యంలో చేదోడు ఉంటుందని, రెండు రూపాయల వడ్డీకి ఆశపడి లక్షలాది మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలు బా«ధితులుగా మిగిలారన్నారు. అగ్రిగోల్డ్‌ నుంచి డబ్బులు వెనక్కి రావన్న బెంగతో రాష్ట్రంలో 107 మంది ఖాతాదారులు, ఏజెంట్లు మృతి చెందారన్నారు. ప్రజల నుంచి సేకరించిన కోట్లాది రూపాయలను బినామీలు, బంధువుల పేర్లపై డైరెక్టర్లు పెట్టుకున్నట్టు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని, డబ్బులు వెనక్కి ఇప్పించాలని దాదాపు రెండేళ్లుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మార్చి నెలలో విజయవాడలో 18 రోజుల పాటు వేలాది మంది బా«ధితులతో నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. దీక్షలకు పలు రాజకీయపార్టీలు మద్దతు పలకడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు తొలుత రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్న సీఎం, ఆతర్వాత రూ. 5 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారన్నారు. రెండు నెలల్లో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి చర్యలు తీసుకుంటానని, ఇందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుని, ప్రత్యేక కమిటీతో చెల్లింపులకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. సీఎం హామీ నెరవేరేదాకా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి మండలం, జిల్లాస్థాయిలో  కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు కోరారు. డబ్బులు చేతికి వచ్చేదాకా అలుపెరగని పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవ్వాస్‌ కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేసేదాకా సమష్టిగా పోరాటం చేసేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను నియమించేందుకు సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించారు. ఖాతాదారులు, ఏజెంట్ల సంఘం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి బి.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు శేషుకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కొల్లు శ్రీనివాస్, సిటీ కార్యదర్శి రాంబాబులతో పాటూ సుమారు 500 మంది బాధితులు పాల్గొన్నారు.
ఆత్మహత్యే శరణ్యం 
పన్నెండేళ్లుగా అగ్రిగోల్డ్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నా. 150 మంది ఖాతాదారులతో రూ.కోటి మేర డిపాజిట్లు కట్టించా. అగ్నిగోల్డ్‌ కంపెనీ మాటలకు మోసపోయి స్నేహితులు, బంధువులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాను. అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసి డబ్బులను ఖాతాదారులకు చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. డిపాజిట్ల సొమ్ము వెనక్కి రాకపోతే ఆత్మహత్యే శరణ్యం.
- బొమ్మేటి రాంబాబు, అగ్రిగోల్డ్‌ ఏజెంట్, కాకినాడ
 
రూపాయి రూపాయి పోగుచేసి..
మాది మత్స్యకార కుటుంబం. రెక్కాడితేనేగానీ డొక్కాడని పరిస్థితి. సొంత గూడు నిర్మించుకునేందుకు రూపాయి రూపాయి పోగుచేసి రూ.30 వేలు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశా. పదేళ్లలో 100 గజాల స్థలం ఇస్తామని ఏజెంట్‌ చెప్పడంతో డబ్బు డిపాజిట్‌ చేశా. అగ్రిగోల్డ్‌ కంపెనీ మోసం చేయడంతో దిక్కుతోచడం లేదు. 
- చింతపల్లి నూకమ్మ, బాధితురాలు, పర్లోపేట,కాకినాడ

Advertisement
Advertisement