సీజనల్ వ్యాదులతో అప్రమత్తం | Sakshi
Sakshi News home page

సీజనల్ వ్యాదులతో అప్రమత్తం

Published Mon, Sep 26 2016 11:28 PM

సీజనల్ వ్యాదులతో అప్రమత్తం

అఫ్జల్‌గంజ్‌: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సి. లక్ష్మారెడ్డి కోరారు. ఆయన సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి భవనం పరిస్థితిని పరిశీలించి, పాత భవనంలోని 1,2 అంతస్తుల్లోని వార్డులను, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. వార్డులలో చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించి వారితో మాట్లాడారు. జహీరాబాద్‌కు చెందిన వెంకటనర్సింహ కిడ్నీలో రాళ్ళువచ్చాయని 45 రోజులుగా చికిత్స పొందుతున్నానని, రాత్రి వేళలో సెక్యూరిటీ సిబ్బంది లేని కారణంగా దొంగలు తిరుగుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

 ఒకరిద్దరు ముసుగులతో వచ్చి రాత్రి వేళ నిద్రించి వెళ్తున్నారన్నారు.  రోగులకు భద్రత కరువైందని మంత్రికి ఫిర్యాదుచేశాడు. హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులు కొరత ఉందని వారిని త్వరితగతిన నియమించాలని కోరుతూ నర్సులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సూపరిండెంట్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... వైద్యశాఖ అన్ని పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక వైద్య క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు.

ఆస్పత్రి భవనాన్ని ఎప్పటికప్పుడు ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందన్నారు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు టీఎస్‌సీఎస్సీద్వారా 2118 పోస్టులకు త్వరలో నీటిపికేషన్ వెలువడనుందని అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ జీవీఎస్‌ మూర్తి, చీఫ్‌ ఇంజనీర్‌ లక్ష్మారెడ్డి, ఆర్‌ఎంఓలు నజాఫీ, కవిత, రఫి, రాష్ట్ర వైద్యుల సంఘం అద్యక్షులు బొంగు రమేష్, నాగేందర్, ప్రవీణ్, అన్ని విభాగాల అదిపతులు, టిఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌వి మహేందర్, సంతోష్‌ గుప్త తదితరులు ఉన్నారు.
నిమ్స్‌లో  ఆకస్మిక తనిఖీ
పంజగుట్ట: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి సోమవారం నిమ్స్‌ ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సాయంత్రం 4:30 ప్రాంతంలో నిమ్స్‌కు వచ్చిన ఆయన అరగంటపాటు అక్కడే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన నియోజకవర్గం కార్యకర్తను పరామర్శించిన ఆయన పలువురు రోగులతో మాట్లాడి నిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశాడు. పలువురు రోగులు, సహాయకులు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని కోరగా వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి వెంట నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్, పలువురు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు.  

 

Advertisement

తప్పక చదవండి

Advertisement