ప్రత్యేక రైళ్లన్నీ కోస్తా వైపే | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లన్నీ కోస్తా వైపే

Published Sun, Oct 2 2016 12:03 AM

ప్రత్యేక రైళ్లన్నీ కోస్తా వైపే - Sakshi

– దసరా సందర్భంగా స్పెషల్స్‌ నడుపుతున్న ద.మ. రైల్వే
– సర్వీసులన్నీ విజయవాడ, విశాఖ వైపే.. కర్నూలుకు లభించని స్థానం
– సాధారణ రైళ్లలో భోగీలన్నీ ఫుల్లు
 
కర్నూలు(రాజ్‌విహార్‌): దసరా పండుగను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లన్నీ కోస్తా వైపుగానే పరుగులు తీస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా కర్నూలు మీదుగా లేకపోవడం ఇక్కడి ప్రయాణికులను అసంతప్తికి గురి చేస్తోంది. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 12రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూరు వెళ్లి సంబరాలు నిర్వహించుకునేవారంతా ప్రయాణానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో  దక్షిణ మధ్య రైల్వే .. ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఇప్పటికే 20రైళ్లను ప్రవేశపెట్టిన ఉన్నతాధికారులు తాజాగా మరో 22 రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఇందులో  ఒక్కటి కూడా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ మీదుగా నడపడం లేదు. అన్ని విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి తదితర ప్రాంతాలకే నడుస్తున్నాయి. దీంతో జిల్లా వాసులు ప్రయాణాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.  స్పెషల్‌ ట్రై న్స్‌ లేకపోవడం, ఉన్నవాటిలో బెర్తులు, జనరల్‌ కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసి ఉండడం, పెరిగిన అర్టీసీ చార్జీల కారణంగా జిల్లా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
నో బెర్త్‌.. నో రూం.
దసరా ప్రయాణాలుండడంతో  రోజువారీ∙రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. వాటిలో బెర్తులన్నీ నిండిపోవడంతోపాటు జనరల్‌ కంపార్ట్‌మెంట్లు కిటకిటలాడుతున్నాయి. టికెట్‌ తీసుకొని రైలెక్కిన ప్రయాణికులకు కూర్చునే సీటు దొరక్క డోర్లు, బాత్‌రూముల వద్ద, లగేజీ బోగీల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంత ప్రయాణికులు బాధలు ఇక చెప్పాల్సిన పని లేదు. రిజర్వేషన్ల కోసం క్యూలో నిల్చున్న ప్రయాణికులకు నో బెర్త్‌.. వెయిటింగ్‌ లిస్టు.. నో రూమ్‌ సమాచారం ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదు నుంచి కర్నూలు మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రోజువారి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోపాటు వారంతపు రైళ్లు, ఇంటర్‌సిటీ (హంద్రీ), తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లేవి ఇందుకు మినహాయింపు కాదు. 

Advertisement
Advertisement