'ఇంతటి కరువు ఎప్పుడూ చూడలేదు' | Sakshi
Sakshi News home page

'ఇంతటి కరువు ఎప్పుడూ చూడలేదు'

Published Thu, Sep 3 2015 4:34 PM

'ఇంతటి కరువు ఎప్పుడూ చూడలేదు' - Sakshi

మహబూబ్ నగర్: రాష్ట్రంలో ఇంతటి కరువును ఎప్పుడు చూడలేదని బచావో తెలంగాణ మిషన్ కన్వీనర్ నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన జడ్చర్ల, కల్వకుర్తి మండలాల్లో తిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏకవ్యక్తి పాలన నడుస్తోందని.. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంటే, కేంద్రానికి కరువు నివేదక పంపకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 'మిషన్ కాకతీయ'లో కాంట్రాక్టర్లు, టీఆర్‌ఎస్ కార్యకర్తలే బాగుపడ్డారని విమర్శించారు. కేసీఆర్ ఇలాగే ప్రవర్తిస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు.

కరువు రక్కసిలో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చైనా బాట వదిలి.. పంటచేల బాట పట్టాలని  సూచించారు. ప్రభుత్వానికి ఏమాత్రం రైతుల గురించి పట్టింపు లేదని విమర్శించారు. సెప్టెంబర్ 30 దాకా వేచి చూద్దామని సీఎం చెప్పటం భావ్యం కాదన్నారు. రైతులను ఎలా ఆదుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గూగుల్ మీద కూర్చుని భూమి అంతా పచ్చగా ఉందనుకుంటే చాలదు.. నిద్రావస్తలోనుంచి బయటకు రావాలని సూచించారు. నాగం వెంట మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దుష్యంత్‌రెడ్డి, మల్లయ్యగౌడ్, నర్సింహులు తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement