ఆదాల, అజీజ్‌కు ఆనం చెక్‌ | Sakshi
Sakshi News home page

ఆదాల, అజీజ్‌కు ఆనం చెక్‌

Published Sat, Oct 8 2016 1:01 AM

anam check to adala and aziz

  •  ఎస్‌సీ సబ్‌ప్లాన్‌ పనులు తమ చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహం
  •   కాంట్రాక్టర్లతో నేరుగా ఆనం సోదరుల చర్చలు
  •  తమ వారినీ రంగంలోకి దించి లెస్‌కు టెండర్లు దాఖలు చేయించేందుకు నిర్ణయం
  •  ఈ పనులతో సిటీ, రూరల్‌ నియోజక వర్గాల్లో పట్టు పెంచుకునే ఎత్తుగడ
  •  
     
    సాక్షి ప్రతినిధి – నెల్లూరు  నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజక వర్గాల్లో  తమ పట్టు పెంచుకోవడానికి ఆనం సోదరులు మళ్లీ రంగంలోకి దిగారు. ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌ కింద రూ 42 కోట్లతో నిర్మించనున్న పనులను ఆయుధంగా మలుచుకుని తమ ప్రత్యర్థులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అజీజ్‌కు చెక్‌ పెట్టడానికి వ్యూహ రచన చేశారు.
                     శాసనసభ ఎన్నికల అనంతరం జిల్లాలో జరిగిన రాజకీయ కుప్పి గంతుల తర్వాత నెల్లూరు టీడీపీలో కొత్త గ్రూపులు తయారయ్యాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలో చేరిన మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ నగరంలో తన పట్టు పెంచుకోవడానికి ఉవ్విళ్లూరారు. సామాజక సమీకరణలో వచ్చే సారి తనకు అవకాశం రాకపోదా అనే ఆశతో పనిచేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కార్పొరేషన్‌ మొత్తం పరిధిలో తన వారిని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రూరల్‌ నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డితో విబేధాలకు దిగారు. ఈ పరిణామాలు నడుస్తున్న తరుణంలోనే ఆనం సోదరులు కాంగ్రెస్‌ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం నెల్లూరులో అందరికంటే ఎక్కువ అజీజ్‌కే ఆందోళన కలిగించింది. తనను గట్టిగా వ్యతిరేకించే ఆనం కుటుంబం తానున్న పార్టీలోకే వస్తే తనను మడిచేస్తారనే ఆందోళన ఆయనలో వ్యక్తం అయ్యింది. కొంత కాలం పాటు లోలోన ఉన్న  విబేధాలు ఇటీవల బహిర్గతం అయ్యాయి. ఆక్రమణల కూల్చి వేత సమయంలో ఆనం వివేకానందరెడ్డి నేరుగా మేయర్‌ మీద దాడికి దిగారు. అజీజ్‌ కూడా గట్టిగానే ఎదురు దాడి చేశారు. ఈ వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టేలా తయారు కావడంతో హై కమాండ్‌ రంగంలోకి దిగడంతో వివాదానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. ఆనంతో ఎప్పకైనా ఇబ్బందే అనే అభిప్రాయంతో మేయర్‌ అజీజ్‌ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో స్నేహం ప్రారంభించారు.  కార్పొరేషన్‌ పరిధిలోని రూరల్‌నియోజక వర్గంలో ఆదాలకు మేయర్, సిటీ నియోజక వర్గంలో మేయర్‌కు ఆదాల సహరించుకునేలా రాజీ  ఒప్పందానికి వచ్చారు.  ఈ విషయం తెలిసుకున్న ఆనం సోదరులు అటు ఆదాల, ఇటు అజీజ్‌కు ఒకే సారి చెక్‌ పెట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు.
     
     రూ 42 కోట్ల పనులతో ఆధిపత్యం
                 కార్పొరేషన్‌ పరిధిలో 8 ప్యాకేజీల కింద రూ 42 . 21 కోట్లతో  ఎస్‌సీ సబ్‌ప్లాన్‌ నిధుల కింద చేపట్టే పనుల్లో పూర్తిగా తన ముద్రే ఉండాలని మేయర్‌ అజీజ్‌ వ్యూహరచన చేశారు. కాల్వలు, సిమెంటు రోడ్లు, తారు రోడ్ల పనులు మొత్తం తాను చెప్పిన వారికే దక్కేలా టెండరు నిబంధనలు తయారు చేయించారనే ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌బి శాఖలు పెట్టే టెండర్‌ నిబంధనలను తొలిసారి కార్పొరేషన్‌ పనుల్లో అమలు చేసి ప్రత్యర్థులకు చెక్‌ పెట్టేలా రాజకీయం నడిపారు. ఈ పనులకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఆనం సోదరులు తమ మద్దతు దారులైన పెద్ద కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు. మేయర్‌ ప్రతి పనికీ తక్కువతో టెండర్లు దాఖలు కాకుండా ఏర్పాటు చేయించుకున్నందున ప్రతి పనికీ 10 శాతం తక్కువతో టెండర్లు దాఖలు చేయాలని తమ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన సుమారు 10 మంది కాంట్రాక్టర్లతో ఆనం సోదరులు నేరుగా మాట్లాడారని సమాచారం. తాము చెప్పిన వారికే పనులు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఒక వైపు తమ మద్దతు దారులైన కాంట్రాక్టర్లను రంగంలోకి దించి తక్కువతో టెండర్లు దాఖలు చేయించడం, ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన వారిని తమ దారిలోకి తెచ్చుకుని అజీజ్‌కు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగారు. ఇక పోతే రూరల్‌ నియోజక వర్గ పనులకు సంబంధించి కూడా కాంట్రాక్టర్లతోనేరుగా మాట్లాడి పనులు తమ చేతుల్లోకి తెచ్చుకుంటే ఆదాల ఆధిపత్యానికి కూడా చెక్‌ పెట్టే వ్యూహం అమలు చేశారు. తమ నియోజక వర్గంలో చేయబోతున్న పనులకు సంబంధించి ఆనం సోదరులు కాంట్రాక్టర్లతో మాట్లాడటం పట్ల ఆదాల ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో చేపట్టబోయే పనులు అగ్రవర్ణనేతల మధ్య రాజకీయ పో రాటానికి అస్త్రాలుగా మారడంపై అటు అధికార వర్గాలు, ఇటు టీడీపీ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.
     

Advertisement
Advertisement