భక్తజన ప్రవాహం | Sakshi
Sakshi News home page

భక్తజన ప్రవాహం

Published Sun, Aug 14 2016 11:18 PM

భక్తజన ప్రవాహం

  • సత్యదేవుని సన్నిధానానికి 40 వేల మంది భక్తులు
  • ఎండదెబ్బతో ఇబ్బందులు
  • పట్టించుకోని అధికారులు
  •  
    వరుస సెలవులు కలసిరావడం.. ఏకాదశి పర్వదినం కావడంతో.. సత్యదేవుని సన్నిధానం భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం ఒక్క రోజే రత్నగిరికి సుమారు 40 వేలమంది భక్తులు తరలివచ్చారు. వేలాదిగా వ్రతాలు నిర్వహించారు.
     
    అన్నవరం :
    వరుస సెలవులు కావడంతో సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఆదివారం శ్రావణ శుద్ధ ఏకాదశి పర్వదినం కావడంతో 40 వేల మంది వరకూ భక్తులు రత్నగిరికి తరలివచ్చారు. 3,679 వ్రతాలు నిర్వహించారు. 39 కల్యాణాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైనప్పటికీ ఉదయం పది గంటల నుంచి మాత్రం వారి తాకిడి విపరీతంగా పెరిగింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. వేలాదిగా వాహనాల్లో భక్తులు రావడంతో రత్నగిరి ఘాట్‌రోడ్‌లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అయితే ఎండాకాలాన్ని తలపించేలా సూర్యుడు 35 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతతో ప్రతాపం చూపించడంతో భక్తులు అల్లాడిపోయారు. దేవస్థానం ప్రాంగణంలో నిలువ నీడ లేక ఇబ్బంది పడ్డారు. దేవస్థానం ప్రాంగణంలో ఉన్న రాతినేల, దానిపై గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ ఉదయం పది గంటలకే వేడెక్కిపోవడంతో అవస్థలు పడ్డారు. నాలుగడుగులు వేస్తే చాలు.. కాళ్లు బొబ్బలెక్కిపోతూండడంతో పరుగులు తీశారు. పశ్చిమ రాజగోపురంవద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ వాహనాలు దిగిన భక్తులు పరుగులాంటి నడకతో గోపురం లోపలకి వెళ్లాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. వ్రతం టిక్కెట్టు, స్పెషల్‌ దర్శనం టిక్కెట్టు కొనుగోలు చేసి వేడెక్కిపోయిన గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ మీద నడచి వెళ్లాల్సి రావడంతో నరకం చవి చూశారు. వ్రతమండపాల చుట్టూ ఉన్న ప్రాకారం, నిత్య కల్యాణ మండపం, రామాలయ ప్రాంగణం, కారు పార్కింగ్‌ వద్ద ఎండ వేడికి తాళలేక.. కింద ఫ్లోరింగ్‌ వేడెక్కిపోయి భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎండ నుంచి రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను పలువురు కోరుతున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement