ఉన్నవారికే పనిలేదు...కొత్తగా ముగ్గురు! | Sakshi
Sakshi News home page

ఉన్నవారికే పనిలేదు...కొత్తగా ముగ్గురు!

Published Fri, Feb 24 2017 10:17 PM

ఉన్నవారికే పనిలేదు...కొత్తగా ముగ్గురు!

రత్నగిరిపై కొత్తగా ఏఈఈలను నియమించిన సర్కారు
కాంట్రాక్ట్‌ పద్ధతిని నెలకు రూ.30 వేల వేతనం
ముగ్గురికీ ఏటా రూ.పది లక్షల అదనపు భారం
అన్నవరం :తాదూర కంత లేదు..మెడకో డోలు అన్న చందంగా అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగులకే పెద్దగా పనిలేని స్థితిలో మరో ముగ్గురు ఏఈఈలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ.30 వేలు వేతనం చెల్లించేలా కాంట్రాక్ట్‌ పద్ధతిపై ముగ్గురిని నియమించినట్టు ఈఓ కే నాగేశ్వరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ద్వారా వారిని ఎంపిక చేసిందని తెలిపారు. ఈ ముగ్గురిలో దేవరకొండ సత్యచైతన్య, గాలి సురేష్‌ను సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో, పీ వేంకటేశ్వర్లును ఎలక్ట్రికల్‌ విభాగంలో నియమించారు.
ఖర్చు తప్ప ఒరిగేదేమిటి?
దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రస్తుతం ఒక ఈఈ, ఇద్దరు డీఈఈలు, ఐదుగురు ఏఈఈలు ఉన్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో చేపట్టిన నిర్మాణ పథకాలు పెద్దగా ఏమీ లేవు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పనులు మినహా తరువాత చేపట్టిన పనులంటూ ఏమీ లేవు. దేవస్థానం స్థలాల చుట్టూ గోడలు కట్టడం, చదును చేయడం వంటి పనులు మాత్రమే చేస్తున్నారు. సత్యగిరి మీద స్మార్త, ఆగమ పాఠశాల పనులు మాత్రం కొనసా...గుతూ ఉన్నాయి. యాగశాల, అన్నదాన భవనం, తదితర నిర్మాణాలలో కొన్ని దాతల కోసం ఎదురుచూస్తుండడంతోను, మరికొన్ని పనులకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరో ముగ్గురు ఏఈఈల వల్ల దేవస్థానానికి ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement