మేల్కోకపోతే కన్నీళ్లే..! | Sakshi
Sakshi News home page

మేల్కోకపోతే కన్నీళ్లే..!

Published Thu, May 11 2017 11:28 PM

మేల్కోకపోతే కన్నీళ్లే..! - Sakshi

– సిద్ధేశ్వరం స్ఫూర్తితో మరో ఉద్యమం
– 21న నంద్యాలలో జల చైతన్య సభ
– భారీగా రైతులను సమీకరించే సన్నాహాలు
– నిధులు..నీళ్లు కేటాయించాలంటున్న
   ప్రజా సంఘాల నాయకులు
కర్నూలు సిటీ: కరువు కోరల్లో రాయలసీమ విలవిల్లాడుతోంది. నీటి కేటాయింపుల్లో శతాబ్దాలుగా సీమకు అన్యాయం జరుగుతోంది.  గుండె మండిన రైతులు.. చైతన్యవంతమవుతున్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండానే సొంతంగా సంఘాలు , గ్రూపులు ఏర్పాటు చేసుకొని నీటివాటా కోసం పోరాటం మొదలు పెట్టారు. ఇందుకు కర్నూలు జిల్లాను వేదిక చేసుకున్నారు. సీమకు జలాలను అందించే వనరులు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచే హక్కుల సాధనకు ఉద్యమాలు మొదలు పెడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే భావన సీమవాసుల్లో ఉంది. సాగునీటి కోసం కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని, నిర్మించిన ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని కోరుతూ గతేడాది మే నెల 31వ తేదీన భారీ ఎత్తున రైతులు ..సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి శంకుస్థా«పన చేసిన విషయం తెలిసిందే.
 
ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా అప్పట్లో రైతులు బెదరకుండా తమ లక్ష్యమేమిటో తేల్చిచెప్పారు. నేడు అదే స్ఫూర్తితో మరో సారి తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21వ తేదిన నంద్యాలలో రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ జలచైతన్య సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. నీటి కేటాయింపుల్లో సీమకు జరుగుతున్న అన్యాయంపై వివిధ ప్రజా సంఘాలతో కలిసి రైతు సంఘాల నాయకులు నాలుగు జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని వర్గాలకు చెందిన వారిని ఈ సమావేశాల్లో భాగస్వాములను చేయడంతో గతంలో కంటే ఈ సారి పెద్ద ఎత్తున అన్నదాతలు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
నీటి కేటాయింపుల్లో అన్యాయం...
రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూమి 98.95 లక్షల ఎకరాలు ఉంది. దక్షిణ కోస్తాలో 91.14 లక్షల ఎకరాలు, ఉత్తర కోస్తాలో 28.03 లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది. రాయలసీమలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో  15.5 శాతానికి మాత్రమే సాగు నీటి సదుపాయం ఉంది. ఇందులో కూడా కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది. దక్షిణ కోస్తాలో 83.5 శాతం భూమికి సాగు నీటి సదుపాయం ఉంది. అయినా అక్కడే కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. కృష్ణా జలాల పంపకాల్లో రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు మిగులు జలాలు కేటాయించారు.
 
పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వచ్చే 80 టీఎంసీలు, పులిచింతల ద్వారా లభ్యమయ్యే 35 టీఎంసీలను రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తూ నికర జలాలుగా మార్చాలనే డిమాండ్‌ సీమలో   పెరుగుతోంది. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టాన్ని 1996లో చంద్రబాబు ప్రభుత్వం తగ్గించింది. ఈ స్థాయిలో నీటిమట్టం ఉంటేనే సీమ కాలువలకు నీరు వెళ్తుంది. లేదంటే నీళ్లు రాక పంటలు పండవు. దీనికి తోడు చట్ట ప్రకారం కేటాయించిన నీరు సీమకు అందడం లేదు. తుంగభద్ర జలాల్లో వాటా మేరకు నీరు రాకపోయినా అడిగే వారే లేకుండా పోయారు. సీమ సస్యశ్యామలం కావాలంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని, గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తిచచేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తూన్నాయి. విభజనతో మరుగునపడిన దుమ్ముగుడెం ప్రాజెక్టును చేపడితే సీమకు 165 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
 
పాలకుల నిర్లక్ష్యం వల్లే  కరువు
 – బొజ్జా దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్‌
రాయలసీమ కరువుకు పాలకుల నిర్లక్ష్యమే కారణం. నీటి కేటాయింపుల సమయంలో ప్రాంత ప్రయోజనాలు కాకుండా, రాజకీయ ప్రాయోజనాలు ఆశించడం వల్లే అన్యాయం జరిగింది. నీటి వాటాపై ఇకనైనా ప్రజల్లో చైతన్యం తీసుకరావాలనే ఈ నెల 21వ తేదీన నంద్యాలలో జల చైతన్య సభను ఏర్పాటు చేశాం. దుమ్ముగుడెంతో 165 టీఎంసీల నీరు సీమకు వచ్చే అవకాశం ఉంది. అయితే విభజన సమయంలో కొంత మంది పోలవరంలోని తెలంగాణ మండలాలు విలీనం చేస్తే ఈ ప్రాజెక్టును ప్రస్తావించమనే ఒప్పందం చేసుకోవడంతో అది మరుగున పడింది. ఇకనైనా కళ్లు తెరవాల్సిన సమయం వచ్చింది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement