తొలకరి పులకింత | Sakshi
Sakshi News home page

తొలకరి పులకింత

Published Wed, Jun 7 2017 3:57 AM

తొలకరి పులకింత

మిర్యాలగూడలో భారీగా.. నల్లగొండ, మునుగోడులో మోస్తరు
దేవరకొండలో నామమాత్రం. నకిరేకల్, సాగర్‌లో చిరుజల్లులు
తొలి వానల్లోనే అపశ్రుతి.. కొట్టం కూలి నర్సింగ్‌భట్లలో మహిళ మృత్యువాత
కమ్మగూడెంలో నేలమట్టమైన కోళ్లఫారాలు.. 8 వేల కోడిపిల్లల మృతి
పలు చోట్ల కూలిన గోడలు, రేకులు..నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు
నేడు, రేపు కూడా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారులు
సాగుకు సిద్ధమవుతున్న రైతాంగం

సాక్షి, నల్లగొండ :
అందరూ ఊహించినట్లుగానే ఈ సారి వరుణుడు తొందరగానే కరుణించాడు. జార్ఖండ్‌ నుంచి ఉత్తర కోస్తా వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా
నిజమే అయింది. మంగళవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడింది. జూన్‌ మొదటి వారంలోనే తొలకరి పలకరించడంతో రైతులు దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే.. తొలి వానల్లోనే జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. నల్లగొండ మండలం నర్సింగ్‌భట్లలో పశువుల కొట్టం కూలి చంద్రకళ (45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. ఇక, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా పలు చోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇళ్ల గోడలు కూలిపోవడం, రేకులు లేచిపోవడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చండూరు మండలం కమ్మగూడెంలోని మూడు కోళ్లఫారాలు కూలిపోవడంతో 8వేల కోడిపిల్లలు చనిపోయాయి. ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. మొత్తం మీద ముందస్తు వానలతో జిల్లా రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.

12న రుతుపవనాల రాక ?
తొలకరి వానలు పలకరించినా.. జిల్లాలో రుతుపవనాల ప్రవేశం ఈనెల 12 లేదా ఆ తర్వాతే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. వాస్తవానికి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోకి ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అడ్డుకుంటోందని, ఈనెల 8 తర్వాత ఆవర్త నం తగ్గుముఖం పట్టే అవకాశం ఉండడంతో అప్పుడు కదిలే రుతుపవనాలు 12 నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మరో రెం డు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో దాదాపు ఇక వర్షాలు ప్రారంభమైనట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక, అన్నదాతలు ఖరీఫ్‌ సాగుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దుక్కులు దున్నుకునే పనులకు సిద్ధమవుతున్నారు.

నియోజకవర్గాల వారీగా వర్షం.. నష్టం వివరాలు..
మిర్యాలగూడ : నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ గాలులతో కూడిన వర్షం కురవడంతో నీరు ఎక్కడికక్కడ నిలి చింది. రోడ్లు, మురుగు కాలువలు జ లమయమయ్యాయి. మిర్యాలగూడ కూరగాయల మార్కెట్‌లోని మిర్చి బజార్‌లో దుకాణాల్లోకి వరద నీరు చే రింది. స్థానిక నెహ్రూనగర్‌లో పెద్ద చెట్టు స్థానికంగా నివాసం ఉండే సత్యనారాయణ ఇంటిపై పడడంతో  ఇం ట్లో సామగ్రి ధ్వంసమయ్యాయి. పట్ట ణంలో రోడ్ల వెంట ఉన్న హోర్డింగ్‌లు కూలిపోయాయి. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో ఉన్న సాయిరమణ రైస్‌ ఇండస్ట్రీలో ప్రహరీ కూలింది. అన్నపురెడ్డిగూడెంలోని పా ల్వాయి రాంరెడ్డికి సంబంధించి ఇళ్ల పైకప్పు రేకులు గాలికి లేచిపోయాయి.

నల్లగొండ : నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల సాయంత్రం 4 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూ డిన వర్షంపడింది. బలమైన ఈదురుగాలుల కారణంగా తిప్పర్తి మండలం చిన్నసూరారంలో మూడు ఇళ్ల రేకులు లేచిపోయాయి. రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నల్లగొండ మండలం నర్సింగ్‌ భట్లలో ఈదురుగాలుల తాకిడికి పశువుల కొట్టంలో పనిచేస్తున్న చామకూరి చంద్రకళ (45)పై దూలం విరిగి పడడంతో  ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త శంకరయ్యకు కా లు విరగడంతో చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. అదే గ్రామంలో హైమాస్ట్‌ లైట్ల విద్యుత్‌ స్తంభంతోపాటు మరో రెండు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. నల్లగొండ పట్టణం, కనగల్‌ మండల కేంద్రాల్లో చిరు జల్లులు కురిశాయి.

మునుగోడు : నిమోజకవర్గంలోని పలు మండలాలో వర్షం కురిసింది. చండూరు మండలంలోని కమ్మగూడెంలో ఈదురుగాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. 3 కోళ్ల ఫారాల రేకులు కూలిపోయి..  8వేల కోడి పిల్లలు మృతిచెందాయి. 15 ఇళ్ల రేకులు లేచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరగడంతో విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. గట్టుప్పల్‌లో ఒక ఇంటి రేకులు లేచిపోయాయి. మిగతా గ్రామాల్లో చిన్నపాటి చినుకులు పడ్డాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలంలో మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడేం గ్రామ పరిధిలోని కుర్మకుంట నిండి అలుగుపోసింది. చౌటుప్పల్‌లో చినుకులు పడ్డాయి. మునుగోడు, మర్రి గూడ, మండలంలో వర్షం పడలేదు.

నకిరేకల్‌ :  మధ్యాహ్నం 3 నుంచి సా యంత్రం 6 గంటల వరకు పట్టణంతోపాటు కట్టంగూర్, శాలిగౌరారం, కేతేపల్లి మండలాల్లో  కుం డపోత వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాం తాలన్నీ జలమయమయ్యాయి.

నాగార్జునసాగర్‌ : నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
దేవరకొండ : నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఎక్కడ కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. చందంపేట, కొండమల్లేపల్లి, దేవరకొండ, డిండి, పీఏపల్లి మండలాల్లో చిరు జ ల్లులు కురిశాయి. డిండిలో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడ్డాయి.

ఎండలే ఎండలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు జిల్లా వాసులను ఠారెత్తించాయి. ఏప్రిల్‌ మాసంలోనే తన ప్రతాపాన్ని చూపిన భానుడు మే నెలలో నిప్పులు చెరిగాడు. ఈసారి ఏకంగా 46.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత జిల్లాలో నమోదైంది. ఎండలకు తోడు వడగాల్పులు, ఉక్కపోతతో దాదాపు రెండు నెలలుగా జిల్లా ప్రజానీకం అల్లాడిపోయింది. ఈ క్రమం రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, వర్షాలు ప్రారంభం కావడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు
తేద  గరిష్ట ఉష్ణోగ్రత     (డిగ్రీలలో)
జూన్‌ 6    42.2
జూన్‌ 5    42.4
జూన్‌ 4    43.4
జూన్‌ 3    43.6
జూన్‌ 2    43.4
జూన్‌ 1    43.8
(ఈ సారి అత్యధికంగా మే 24న 45, మే 20న 46.2, మే 19న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.)

 

Advertisement
Advertisement