ఏవోబీ ఎన్‌కౌంటర్‌ పచ్చిబూటకం | Sakshi
Sakshi News home page

ఏవోబీ ఎన్‌కౌంటర్‌ పచ్చిబూటకం

Published Tue, Oct 25 2016 9:44 PM

ఏవోబీ ఎన్‌కౌంటర్‌ పచ్చిబూటకం - Sakshi

న్యాయవిచారణ జరపాలని ప్రజాసంఘాల డిమాండ్‌ 
 
గుంటూరు వెస్ట్‌: ఆంధ్రా, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల ఘటన పచ్చి బూటకమని, అవి ఎదురుకాల్పులు కాదని, పోలీసుల ఏకపక్ష కాల్పులని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. బ్రాడీపేటలోని యుటీఎఫ్‌ హాలులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. 23వ తేదీ రాత్రి సమయంలో మల్కన్‌గిరి జిల్లా ఒంటుపల్లి పంచాయతీ రామగూడా గ్రామం పరిసర ప్రాంతానికి 14 మంది మావోయిస్టుల దళం వచ్చిందని, రాత్రి అక్కడ బస చేసిందని తెలిపారు. ఆ సమాచారంతో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన సంయుక్త దళాలకు చెందిన 1000 మంది వరకు ఉదయం సమయానికి అక్కడకు చేరుకున్నారన్నారు. మావోయిస్టు దళానికి సమస్యలు చెప్పుకోవటానికి వచ్చిన వారంతా ఆ దళంతోపాటు ఉన్నారన్నారు. రోల్‌కాల్‌ కోసం ఉదయం 6 గంటలకు అందరూ వరుసలో నిలబడగా, పోలీసులు దళంపైకి ఏకపక్షంగా కాల్పులకు పాల్పడ్డారని, దీంతో చాలామంది అక్కడిక్కడే కుప్పకూలారని తెలిపారు.  పోలీసు బలగాలు చిక్కిన వాళ్లను చిక్కినట్లు కాల్చి చంపాయని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలపై విషం కక్కుతూ పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు.  దీన్ని ప్రజాసంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కూంబింగ్‌ను తక్షణమే ఆపివేయాలని, ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న వారిని మీడియా ముందు ప్రవేశపెట్టాలని నాయకులు కోరారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్, పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, విప్లవ రచయితల సంఘం నాయకుడు సీఎస్‌ఆర్‌ ప్రసాద్, ప్రగతి శీల కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.కొండారెడ్డి, పీకేఎం రాష్ట్ర కార్యదర్శి యు.నాగేశ్వరరావు, పీకేఎస్‌ జిల్లా కార్యదర్శి డి.సుధాకర్, కేఎన్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి బి.విజయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement