జీ హుజూర్‌ | Sakshi
Sakshi News home page

జీ హుజూర్‌

Published Wed, Feb 15 2017 11:18 PM

జీ హుజూర్‌ - Sakshi

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి  ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వత్తాసు
– ఎన్జీవోలంతా టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని ప్రకటన
– సెక‌్షన్‌ 129 ప్రకారం అశోక్‌బాబు మాటలు కోడ్‌ ఉల్లంఘన అంటున్న విశ్లేషకులు
– అశోక్‌ తీరును తప్పుబడుతున్న కొందరు ఎన్జీవోలు
– అధికార పార్టీ మినహా తక్కిన ఫ్లెక్సీలు తొలగించి వివక్ష చూపుతున్న అధికారులు
– ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం... మూడోరోజు నాలుగు నామినేషన్ల దాఖలు


(సాక్షిప్రతినిధి, అనంతపురం)
‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డికి ఏపీ ఎన్జీవోల సంఘం మద్దతు ఇస్తోంది. ‘అనంత’లోని ఏపీ ఎన్జీవోలు కూడా ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.’– ఇవీ ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు బుధవారం ‘అనంత’లో చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు చూస్తే టీడీపీకి పూర్తిగా వత్తాసు పలుకుతున్నారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకీ ప్రచారం చేయకూడదు. ఎన్నికల, పోలింగ్‌ ఏజెంట్‌గా ఉండకూడదు. ఓటేయండని బహిరంగంగా ప్రకటనలు చేయరాదు. ఇలా చేస్తే సెక‌్షన్‌ 129 ఆర్‌పీ యాక్టు ప్రకారం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుంది. అయినప్పటికీ అశోక్‌బాబు  బుధవారం అనంతపురంలోని ఎన్జీవో సంఘం కార్యాలయంలో ఏకంగా విలేకరుల సమావేశం నిర్వహించి, కేజేరెడ్డిని సభాపూర్వకంగా అందరికీ పరిచయం చేశారు. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

అశోక్‌బాబు పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ ఘటన అందుకు బలం చేకూర్చుతోంది. గతంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎవరూ ఎన్నికల్లో పలానా వ్యక్తికి ఓటేసి గెలిపించండంటూ బహిరంగ ప్రకటనలు చేయలేదు. వ్యక్తిగత ప్రాధాన్యతలుంటే అంతర్గతంగా మద్దతు ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ తొలిసారిగా అశోక్‌బాబు బాహిరంగంగా టీడీపీ అభ్యర్థికి ఓటేయండని చెప్పడాన్ని చాలామంది ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉంటాయి. కానీ ఎన్జీవోల సంఘం రాజకీయ పార్టీలకు అతీతమైంది.

ఉద్యోగులంతా యూనియన్లలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ పలానా వ్యక్తికి ఓటేయండని చెప్పడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. విలేకరుల సమావేశానికి కంటే ముందు కొందరు ఉద్యోగులతో అశోక్‌బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేజేరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగి మాట్లాడుతూ బాహాటంగా మద్దతు ఇవ్వడం సరికాదేమో అని అశోక్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ప్రభుత్వం మనకు జీతాలు ఇస్తోంది. కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థికి మనం ఓటేయాలి’ అని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో పలువురు ఎన్జీవోలు అశోక్‌బాబు మాటలపై బుధవారం తీవ్ర చర్చ సాగించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు .. అశోక్‌బాబుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఫ్లెక్సీల తొలగింపులో అధికారుల వివక్ష
            ఎన్నికలకోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించిన ఫ్లెక్సీలను కార్పొరేషన్, మునిసిపాలిటీలతో పాటు పంచాయతీల్లో అధికారులు తొలగించారు. టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రం ముట్టుకోలేదు. అనంతపురంలోని టవర్‌క్లాక్, ఫ్లైఓవర్, పాతూరుతో పాటు ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో  ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి. ఈ విషయంలో అధికారుల తీరుపై తక్కిన అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు.

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
    ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఉపందుకుంది. ప్రచారపర్వానికి 18రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. పట్టభద్రుల కోటా నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డి, మహాజన రాజ్యం పార్టీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, మరో అభ్యర్థి శేషుయాదవ్‌ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థి కేవీసుబ్బారెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి నామినేషన్లు వేశారు. గురువారం కూడా పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బరిలోని అభ్యర్థులు రాజకీయపార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి మద్దతివ్వాలని అభ్యర్థిస్తున్నారు.

గోపాల్‌రెడ్డి గెలుపు కోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేజేరెడ్డి అధికార పార్టీ తరఫున బరిలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండగా నిలవలేకపోతున్నారు. ఆయన వచ్చినప్పుడు చేద్దామని చెప్పి పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనువుగా వెళుతున్నారు. దీన్ని గ్రహించిన కేజేరెడ్డి ఖర్చులో కూడా ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారపార్టీ నేతలు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని, వీరిని నమ్ముకుని బరిలోకి దిగి పొరపాటు చేశామని తన సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. అలాగే సీపీఎం మద్దతుతో బరిలో నిలిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గేయానంద్‌ వామపక్షాలపై భారం వేసి ముందడుగు వేస్తున్నారు. అయితే.. వామపక్ష పార్టీల బలం, అనంత, కడప, కర్నూలులోని తాజా రాజకీయపరిస్థితులు ఆయనకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థులంతా ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. ప్రత్యేకహోదా, నిరుద్యోగ సమస్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతిపై ప్రభుత్వం మాట తప్పడం, దీర్ఘకాలికంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించనున్నాయి.

Advertisement
Advertisement