Sakshi News home page

40 అంతస్తుల్లో ఏపీ సచివాలయం!

Published Tue, Dec 1 2015 8:59 AM

40 అంతస్తుల్లో ఏపీ సచివాలయం! - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ఏపీ సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాలకు మధ్యలో తూర్పు అభిముఖంగా ఏపీ సచివాలయాన్ని నిర్మించాలనుకుంటోంది. ఇక్కడ నిర్మించనున్న రెండు ఐకానిక్ భవనాల్లో ఒక భవనంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చుట్టూ రోడ్లు, గ్రీనరీ, విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఉండేలా 40 అంతస్తుల్లో ఈ భవనం ఉండాలని సీఎం ఇప్పటికే అధికారులకు చెప్పారు. ఇదిలాఉండగా ఈ భవనంలో ఒక్కో అంతస్తులో ఐదుగురేసి మంత్రుల చాంబర్లు, ఆయా శాఖల కార్యదర్శుల కార్యాలయాలు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి చివరి అంతస్తులో మాత్రం సీఎం పేషీ, భారీ కాన్పరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఒక్కో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే అధిక మొత్తంలో కార్యాలయాలను నిర్వహించుకునే వీలుంటుం దని అధికారులు చెబుతున్నారు.అధికారులు, మంత్రులకు ఒకే ఫ్లోర్ ఉండటం వల్ల పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని ఆశిస్తున్నారు.

కాగా, ఈ 40 అంతస్తుల ఆకాశహార్మ్యం కోసం మొత్తం రూ.3 వేల కోట్లకు పైగానే ఖర్చయ్యే అవకాశముందని, ఈ నిధులను కేంద్రం నుంచి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే రాజధాని అమరావతి నిర్మాణ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదం తీసుకున్న తర్వాత స్ట్రక్చరల్ కన్సల్టెన్సీని పిలిచి డి జైన్లు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిధులు చేతికందితే వచ్చే జూన్ నుంచి పనులు మొదలుపెట్టే అవకాశం ఉందంటున్నారు.

Advertisement
Advertisement