ఏపీ ఎస్పీడీసీఎల్‌ పేరిట మోసం | Sakshi
Sakshi News home page

ఏపీ ఎస్పీడీసీఎల్‌ పేరిట మోసం

Published Wed, Aug 17 2016 7:47 PM

చిత్తూరులో ఓ నివాసంలోని మీటర్లుకు అతికించిన నకిలీ ఏపీఎస్పీడీసీఎల్‌ స్టిక్కర్సు - Sakshi

  •  విద్యుత్‌ మీటరు ఐడీకార్డుకు రూ.20 వసూలు
  •  జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్న ఫేక్‌ ముఠా
  •  వినియోగదారుల నుంచి రూ.22 కోట్లు కొట్టేయడానికి స్కెచ్‌
  • చిత్తూరు (కార్పొరేషన్‌): ‘సార్‌ మేం.. ఏపీ ఎస్పీడీసీఎల్‌ (విద్యుత్తుశాఖ) నుంచి వసున్నాం.. మీ విద్యుత్తు మీటరుకు రూ.20 చెల్లించి ఐడీకార్డు స్టిక్కర్‌ మీద సర్వీసు నంబరు వేసుకోవాలని.. అప్పుడు రీడింగ్‌ చెయ్యడానికి సులభంగా ఉంటుంది’ అని ఓ ఫేక్‌ ముఠా జిల్లాలో ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నూతన రూల్‌ అని చెప్పి మీటరు స్టిక్కర్స్‌ తీసుకోవాలని నమ్మబలుకుతూ మోసం చేస్తున్నారు. జిల్లా వినియోగదారుల నుంచి రూ.22 కోట్లు కొట్టేయడానికి స్కెచ్‌ వేశారు.

    అసలు ఏమిటీ స్టిక్కర్స్‌:
    జిల్లాలో రెండేళ్లుగా మ్యానువల్‌ మీటర్ల స్థానంలో దశలవారీగా బార్‌కోడ్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రీడింగ్‌ తీసేవారు బార్‌కోడ్‌ను స్కాన్‌ చేసి వినియోగదారుడికి బిల్లును అందిస్తున్నారు. నూతనంగా ఓ ముఠా కొద్ది రోజులుగా విద్యుత్తుశాఖ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిమని మీటర్‌పై సర్వీసు నంబరు కనిపించే విధంగా స్టిక్కర్‌ అతికిస్తూ రూ.20 వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక ఉద్యోగి 75 నివాసాలకు స్టిక్కర్స్‌ ఇస్తున్నమని మీరిచ్చే ’20లతో మాకు వేతనాలిస్తున్నారని నమ్మబలుకుతున్నారు. ఇవీ ఎందుకు వేసుకోవాలి.. ఉపయోగం ఏం అన్ని వినియోగదారులు ప్రశ్నించినా మేం కేవలం ఔట్‌స్సోరింగ్‌ ఉద్యోగులమని ప్రభుత్వ నిబంధన అని కచ్చితంగా చెప్పడంతో వేసుకోకపోతే ఇబ్బందులు పడాలనే యోచనతో వినియోగదారులు వీటిని తీసుకుంటున్నారు.  

    రూ.22 కోట్లు కొట్టేయడానికి ప్లాన్‌ 
    జిల్లాలో మొత్తం 11 లక్షల వరుకు విద్యుత్‌ కనెక్షన్స్‌ ఉన్నాయి. ఇప్పటికే ఈ నకిలీ ముఠా తిరుపతి, తిరుపతి రూరల్, పుత్తూరు ప్రాంతాల్లో స్టిక్కర్స్‌ అతికించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారంరోజులుగా చిత్తూరులో వసూలును ప్రారంభించారు. 11 లక్షల విద్యుత్తు కనెక్షన్స్‌ చొప్పున తీసుకున్న మొత్తం ’22 కోట్లు వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే  స్టిక్కర్స్‌ అతికించి రూ.50 లక్షలకు పైగా వసూలు చేశారని సమాచారం.

    స్టిక్కర్‌ తీసుకోవద్దు
    విద్యుత్‌ మీటర్‌కు అసలు స్టిక్కర్‌ అతికించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా స్టిక్కర్స్‌ వేసుకోవాలంటే అధికారికంగా ప్రకటించిన తర్వాత విద్యుత్‌శాఖ శాశ్వత ఉద్యోగులను పంపిస్తాం. డబ్బులు వసూలుకు శాఖ పరంగా ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ముఠాలను ప్రోత్సాహించవద్దు. – సత్యనారాయణ, ఆపరేషన్స్‌ డీఈ, విద్యుత్తుశాఖ చిత్తూరు డివిజన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement