కాలువలో ఆక్వా ఔట్‌లెట్ల కూల్చివేత | Sakshi
Sakshi News home page

కాలువలో ఆక్వా ఔట్‌లెట్ల కూల్చివేత

Published Thu, Nov 17 2016 1:18 AM

కాలువలో ఆక్వా ఔట్‌లెట్ల కూల్చివేత

  •  పెద్ద ఎత్తున రైతుల మోహరింపు
  •  
     ముత్తుకూరు :  మండలంలోని ఈదులవారిపాళెం నుంచి పంటపాళెం చెరువుకు సాగునీరు అందించే న్యూ చానల్‌లో ఆక్వా గుంతల నుంచి పైపులతో అమర్చిన ఔట్‌లెట్లను బుధవారం యంత్రంతో కూల్చివేశారు. దీనితో కాలువ కట్టపై రైతులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ కాలువ కింద 3,000 ఎకరాలు సాగు అవుతోంది. రొయ్యల గుంతల నుంచి వ్యర్ధ జలాలు, అధిక సెలెనిటి కలిగిన ఉప్పు నీటిని ఔట్‌లెట్ల ద్వారా కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఫలితంగా వరిపైరు దెబ్బతినడమే కాకుండా దిగుబడి తగ్గిపోతోంది. కలుషిత జలాలను తాగి పశువులు అనారోగ్యానికి గురౌతున్నాయి. దీనితో పంటపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు దువ్వూరు నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫలితంగా రబీ వరి సాగుకు సాగునీరు విడుదల మొదలయ్యే దశలో ఇటీవల ఔట్‌లెట్లు తొలగించాలని ఆక్వా రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఎటువంటి స్పందన లేకపోవడంతో నీటి సంఘం «అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, దొరువులపాళెం ఎంపీటీసీ సభ్యుడు పర్రిరత్నయ్య, ఇరిగేషన్‌ ఏఈ ప్రసాద్, ఆర్‌ఐ జ్యోతిల సమక్షంలో వేలాడే విద్యుత్‌ తీగలను కట్‌ చేసి, కాలువలో అమర్చిన 15 ఔట్‌లెట్ల పైపులను, కాపలాదారుల పూరిపాకలను కూల్చివేశారు. కాలువ కట్టను వెడల్పు చేశారు. 
    తరలివచ్చిన ఆక్వా రైతులు 
     విద్యుత్‌ తీగలు తొలగించడం, ఔట్‌లెట్లు కూల్చివేయడంతో ఆక్వా రైతులు కాలువ వద్దకు చేరారు. మాజీ నీటి సంఘం అ«ధ్యక్షుడు దామవరపు రామచంద్రారెడ్డి ద్వారా  ఔట్‌లెట్ల తొలగింపు నిలిపివేయాలని ఆయకట్టు రైతులను కోరారు. దీనికి రైతు నాయకులు స్పందిస్తూ, నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో వరిపంటను దెబ్బతీసే వ్యర్ధ జలాల ఔట్‌లెట్లను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. మురుగునీటి తరలింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 
     
     

Advertisement
Advertisement