ఆర్మీ మెకానిక్ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

ఆర్మీ మెకానిక్ అనుమానాస్పద మృతి

Published Fri, Jul 8 2016 2:03 AM

Army mechanic died in suspecious

శ్రీనగర్‌లో ఘటన, మృతుడు కర్నూలు జిల్లావాసి
రుద్రవరం: ఏపీకి చెందిన ఆర్మీ మెకానిక్ జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన బనగాని వెంకటకృష్ణయ్య (25) 2010లో ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం శ్రీనగర్‌లో (13 ఆర్‌ఆర్ విభాగం) విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం రాత్రి 10 గంటలకు కుటుంబసభ్యులతో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. గురువారం ఉదయం 10 గంటలకు మళ్లీ ఫోన్ వచ్చింది. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి కృష్ణయ్య ఫోన్ నుంచే మాట్లాడుతూ అతను మరణించినట్లు చెప్పాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్పించగా చనిపోయినట్లు పేర్కొన్నాడు.
 
  ఏ జరిగిందో చెప్పాలని గట్టిగా అడగడంతో.. ఒకసారి ఆత్మహత్య చేసుకున్నాడని, మరోసారి ఎదురుకాల్పుల్లో మృతి చెందాడని  సమాధానాలిచ్చాడని కృష్ణయ్య బంధువులు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ కావడంతో ఏ విషయం తెలియడం లేదన్నారు. కృష్ణయ్య మరణానికి సంబంధించి తమకెలాంటి అధికారిక సమాచారం అందలేదని రుద్రవరం ఎస్‌ఐ హనుమంతయ్య చెప్పారు. కృష్ణయ్య చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి రమాదేవి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వీరితో పాటు తాతయ్య, నానమ్మలు అతనిపైనే ఆధారపడి ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేని ఈ కుటుంబం రేకుల షెడ్‌లో జీవనం సాగిస్తోంది.
 
 అసూయే హత్యకు దారితీసిందా?: ఇంటర్ చదువుతుండగానే కృష్ణయ్య ఆర్మీలో చేరేందుకు నిర్ణయించుకొని ఉద్యోగం సాధించాడు. చిన్న వయస్సులోనే ప్రమోషన్ కూడా సాధించినట్లు తెలిసింది. తనకన్నా జూనియర్ ప్రమోషన్ సాధించి తన కేడర్‌లో ఉండటం జీర్ణించుకోలేక ఉత్తరప్రదేశ్‌కు చెందిన సహచర ఉద్యోగి ఒకరు తరచూ వేధిస్తున్నట్టుగా కృష్ణయ్య చెప్పేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ కృష్ణయ్య మరణానికి దారితీసి ఉండొచ్చునని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement