Sakshi News home page

స్పందన అంతంతే..!

Published Tue, Aug 23 2016 9:14 PM

స్పందన అంతంతే..! - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని 8.79 లక్షల నల్లాలకు నీటి మీటర్లు ఏర్పాటు చేయాలనుకున్న జలమండలి సంకల్పానికి.. నెలరోజులుగా వినియోగదారుల నుంచి స్పందన నామమాత్రంగానే లభిస్తోంది. మహానగరంలో ప్రస్తుతం 1.69 లక్షల నల్లాలకు మాత్రమే నీటి మీటర్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి. మిగతా 7.10 లక్షల నల్లాలకు డాకెట్‌ సరాసరి(ఒక పైపులైన్‌కున్న నల్లా కనెక్షన్ల సగటు నీటి వినియోగాన్ని బట్టి) పేరుతో నీటి బిల్లులిస్తుండడంతో... వీధిలో తక్కువ నీటిని ఉపయోగించుకున్నవారికీ.. అధికంగా నీటిని వినియోగించుకుంటున్న వారికి ఒకే రీతిన బిల్లులు జారీ అవుతున్నాయి.

ఈనేపథ్యంలో అన్ని నల్లాలకు మీటర్లు బిగించడం ద్వారా శాస్త్రీయంగా నీటి చుక్కను లెక్కగట్టి ఇటు వినియోగదారులకు.. అటు బోర్డుకు నష్టం కలగని రీతిలో బిల్లులు జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లు, లైన్‌మెన్లు, మేనేజర్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు నీటి మీటర్ల ఏర్పాటుపై జలమండలి ముద్రించిన కరపత్రం అందజేసి.. వినియోగదారుల్లో సరైన అవగాహన కల్పించడంలో విఫలమౌతుండడంతో ఈ ప్రక్రియ ప్రహాసనంగా మారుతోంది.

మరోవైపు ఆగస్టు నెలాఖరులోగా నీటిమీటర్లు ఏర్పాటు చేసుకుంటే నీటిబిల్లులో 5 శాతం రాయితీ ప్రకటించినా ఈ ఆఫర్‌ వినియోగదారులను ఆకట్టుకోకపోవడం గమనార్హం. సెప్టెంబరు నెలాఖరులోగా మీటర్లు ఏర్పాటు చేసుకోనివారికి రెట్టింపు నీటి బిల్లులు జారీ చేస్తామని జలమండలి స్పష్టం చేస్తోంది. కాగా శివారు ప్రాంతాల్లో నాలుగు రోజులకోమారు నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాలకు చెందిన వినియోగదారులు మాత్రం నీటి మీటర్లు ఏర్పాటు చేసుకున్నా చేసుకోకపోయినా తమకు పెద్దగా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతుండడం గమనార్హం.

అన్ని మీటర్లకు తూనికలు కొలతల శాఖ గుర్తింపుపై అనుమానాలు..?
నగరంలో నీటిమీటర్లను విక్రయించేందుకు గతంలో జలమండలి యూరో, ఐఎస్‌ఐ ప్రమాణాలున్న 9 కంపెనీలను ఎంపిక చేసింది. అయితే ఆయా సంస్థలు తయారు చేస్తున్న పలు రకాల మీటర్లలో కొన్ని రకాల(మోడల్స్‌) మీటర్లకుSమాత్రమే తూనికలు కొలతల శాఖ ధ్రువీకరణ ఉందని, మరికొన్నింటికి లేవన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కానీ వినియోగదారులు మాత్రం ఈ తొమ్మిది కంపెనీలకు చెందిన మీటర్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈవిషయంలో ఉన్నతాధికారులు స్పష్టతనివ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. లేని పక్షంలో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు చేసిన పక్షంలో వినియోగదారులు బలిపశువులు అవుతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నీటి మీటర్లు దొరికే ప్రదేశాలివే...
1.గోషామహల్, ఖైరతాబాద్, నారాయణగూడ, ఎస్‌.ఆర్‌.నగర్, మారేడ్‌పల్లి, భాగ్యనగర్, ఎన్‌టీఆర్‌నగర్, సైనిక్‌పురి రిజర్వాయర్, బీరప్పగడ్డ రిజర్వాయర్‌(ఉప్పల్‌), బుద్వేల్‌ ఫిల్లింగ్‌ పాయింట్ల వద్ద నున్న జలమండలి కార్యాలయాల వద్ద నీటిమీటర్లు లభ్యమౌతాయి. మీటర్‌ రీడర్లు లేదా లైన్‌మెన్ల సహాయంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇతర వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.హైదరాబాద్‌వాటర్‌.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో సంప్రదించాలి. లేదా 155313 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌చేయాలని జలమండలి ప్రకటించింది.

 జలమండలి ఎంపిక చేసిన మీటర్‌ కంపెనీలివే..
ఒక్కో మీటరు ఖరీదు: మీటర్‌ రకాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.2000 మధ్యన ఉంటుంది.
మీటర్‌ కంపెనీ  –సంప్రదించాల్సిన వ్యక్తి–మీటర్ల సైజు– మీటర్‌ రకం–     ఫోన్‌ నెంబరు
1.     డెక్కన్‌ పవర్‌ ప్రోడక్ట్స్‌ –సీతారామ్‌రెడ్డి–15, 20 ఎంఎం–బీ–మీటర్స్, జీఎన్‌డీ5–
         9849008490
2.     మాంటెక్‌ కన్‌స్ట్రక్షన్స్‌–పీసీరావు–15,20 ఎంఎం–జెన్నర్‌మైనో, మెన్‌ఈటీఎక్స్‌
       –9866306233
3.     దేశ్వాన్‌సిస్టమ్స్‌–ఎస్‌.జె.హెన్రీ–15ఎంఎం–ఎల్‌ష్టర్‌–ఎన్‌100–    8793336925
4.    శ్రీరంగ్‌అకార్డ్‌జెవి–కపిల్‌కరియా–15,20ఎంఎం–ఎల్‌ష్టర్‌–ఎన్‌100–    09324646964
5.    బట్రాన్‌–సంతోష్‌–15,20ఎంఎం–ఐల్ట్రాన్‌ యూనిమాగ్‌–    9392462798
6.    భారత్‌ప్రిసిషన్‌–కుక్రెజా–15,20ఎంఎం–ఇన్‌ఫ్రెన్షియల్‌ టైప్‌–    09312273380
7.    జనరల్‌వాటర్‌మీటర్‌–నరేష్‌చంద్ర–15,20ఎంఎం–చాంబెల్,మాగ్నటిక్‌–    040–24603591
8.    భారతి ఇంజినీరింగ్‌వర్క్స్‌–వేణుగోపాల్‌–15,20ఎంఎం–జెన్నర్‌–    8099921242
9.    గ్లోబల్‌వాటర్‌అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌–చైతన్య–15,20ఎంఎం–గ్లోబల్‌–    9490469750

Advertisement

What’s your opinion

Advertisement