ఉచ్చు బిగుస్తోంది..! | Sakshi
Sakshi News home page

ఉచ్చు బిగుస్తోంది..!

Published Tue, Jun 13 2017 12:55 AM

attack on the home guard in kurnool

హోంగార్డుపై దాడి ఘటన.. దర్యాప్తులో మలుపు
► దాడి దృశ్యాలు బయటకు వెళ్లడంపై విచారణ
► కంట్రోల్‌ రూమ్‌ మహిళా కానిస్టేబుల్‌పై  వేటుపడే అవకాశం
► దాడి చేసిన మనోజ్‌కుమార్‌ గతంలో రౌడీషీటర్‌
► రౌడీషీట్‌ తొలగింపుపై అనుమానాలు
►  కీలకంగా మారిన ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌?


కర్నూలు: హోంగార్డు హుసేన్‌పై దాడి ఘటనలో నిందితులైన స్పెషల్‌ పార్టీ పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన కానిస్టేబుల్‌ మనోజ్‌ కుమార్‌పై గతంలో రౌడీషీట్‌ ఉండడం..అది తొలగిపోవడం.. అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఉన్నతాధికారులు ఉన్న జిల్లా కేంద్రంలోనే  పోలీసు సిబ్బంది అదుపు తప్పి ప్రవర్తించడంపై రాష్ట్రస్థాయి అధికారులు సీరియస్‌ అయినట్లు సమాచారం.

దాడి దృశ్యాలు సీసీ కెమెరాల కంట్రోల్‌ రూమ్‌ నుంచి వాట్సాప్‌కు వైరల్‌ కావడానికి కారకులెవరన్న విషయంపై ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులు విచారణ జరిపారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పైఅంతస్థులో సీసీ కెమెరాల కంట్రోల్‌ రూమ్‌ ఉంది. రాత్రింబవళ్లు అక్కడ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారు. హోంగార్డుపై దాడి సంఘటన జరిగిన రోజు కంట్రోల్‌ రూమ్‌లో మహిళా కానిస్టేబుల్‌ విధుల్లో ఉన్నట్లు విచారణలో తేలింది. దాడి దృశ్యాలు ఎవరి వాట్సాప్‌ ద్వారా బయటకు వెళ్లాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో మహిళా కానిస్టేబుల్‌పై కూడా వేటుపడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఎవరి పాత్ర ఎంత...?
స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు దారితప్పిన ఘటన వెలుగు చూడటంతో పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. మనోజ్‌కుమార్‌ సోదరుల వ్యక్తిగత ప్రవర్తన విషయంలో విచారణ జరిపి రిపోర్టు వారికి అనుకూలంగా ఇచ్చేందుకు భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు రావడంతో రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు శాఖాపరమైన విచారణ మొదలయ్యింది. మనోజ్‌కుమార్‌పై ఉన్న రౌడీషీట్‌ తొలగింపులో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

సమస్యాత్మక వ్యక్తులపై రౌడీషీట్‌ తొలగించేటప్పుడు శాఖాపరంగా పలురకాలుగా విచారణ జరిపి తొలగింపునకు రెకమెండ్‌ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సబ్‌ డివిజన్‌ స్థాయి అధికారులు రౌడీషీటు తొలగిస్తారు. మనోజ్‌కుమార్‌ రౌడీషీట్‌ తొలగించినప్పుడు టౌన్‌ డీఎస్పీ ఎవరున్నారు, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగానికి డీఎస్పీ ఎవరున్నారు? నాల్గో పట్టణ సీఐగా ఎవరున్నారు? రౌడీషీట్‌ తొలగింపునకు ఎవరు రికమెండ్‌ చేశారు? ఏ స్థాయిలో విచారణ జరిగింది?అనే విషయాలపై శాఖాపరమైన విచారణలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

హెడ్‌ కానిస్టేబుల్‌ పనితీరుపై ఫిర్యాదుల వెల్లువ...
స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ మనోజ్‌కుమార్‌పై ఉన్న రౌడీషీట్‌ తొలగింపులో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పాత్ర కీలకం. హోంగార్డుపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా విచారణ షురూ అయింది. పొరుగు జిల్లాకు చెందిన ఈయన సాధారణ కుటుంబం నుంచి వచ్చి జిల్లా పోలీసు శాఖలో ఉద్యోగం పొంది అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారన్న ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్‌ బ్రాంచ్‌ విధుల్లో చేరకముందు రైల్వేలో పనిచేసేటప్పుడు మట్కా, పేకాటరాయుళ్లకు అప్పులు ఇచ్చి భారీ మొత్తంలో వడ్డీలు వసూలు చేసేవారని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. మహారాష్ట్రలోని ఓ మెడికల్‌ కళాశాలలో ఈయన కుమారుడు ఎంబీబీఎస్‌ చదవడానికి  అర కోటి రూపాయలు డొనేషన్‌ చెల్లించారు.

అయితే కళాశాల నిర్వాహకులు డొనేషన్‌ తీసుకుని మోసం చేశారంటూ మూడేళ్ల క్రితం స్వయాన ఆయనే నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదయ్యింది. మళ్లీ అరకోటి రూపాయలు చెల్లించి కుమారుడిని మరో కళాశాలలో చదివిస్తున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయిలో కోటి రూపాయలు డొనేషన్‌ చెల్లించే ఆదాయం ఆయనకు ఎక్కడిదన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగుల వ్యక్తిగత ప్రవర్తనపై నివేదికలు, పాస్‌పోర్టుల విచారణ తదితర విషయాల్లో ముడుపులు దండుకుని భారీగా ఆర్జించాడన్న ఫిర్యాదులు వె ల్లువెత్తిన నేపథ్యంలో హోంగార్డు దాడి ఘటన వెలుగు చూడటంతో విచారణ వేగవంతమయ్యింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement