నిర్మాతపై దాడిని ఖండించిన మనోజ్ | Sakshi
Sakshi News home page

నిర్మాతపై దాడిని ఖండించిన మనోజ్

Published Tue, Aug 2 2016 2:03 PM

నిర్మాతపై దాడిని ఖండించిన మనోజ్ - Sakshi

  • జూనియర్ ఆర్టిస్టుల ఏజెంటుపై ఆరోపణలు
  • సయోధ్యకు హీరో మంచు మనోజ్ ప్రయత్నాలు.. విఫలం
  • పరవాడ పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
  • పరవాడ: ఓ సినీ నిర్మాతపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన  ఉదంతం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో చోటుచేసుకొంది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యాలమ్మపాలెం గ్రామంలో ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్‌తో దర్శకుడు అజయ్ ఇరవై రోజులుగా షూటింగ్ చేస్తున్నారు.
     
     ఈ సినిమాకు కె.ఎస్.ఎన్ రెడ్డి, అచ్చిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్‌కు అవసరమైన 250 మంది జూనియర్ ఆర్టిస్టులను విశాఖకు చెందిన రాము అనే ఏజెంటు సరఫరా చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులకు నిర్మాతలు సుమారు రూ.9 లక్షల బకాయి పడ్డారు. ఇందులో రూ.5 లక్షలు దఫా దఫాలుగా చెల్లించగా మరో రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిని చెల్లించాలని ఏజెంటు రాము ఒత్తిడి తెచ్చినప్పటికీ నిర్మాతలు స్పందించడం లేదు. దీంతో ఆగ్రహించిన ఏజెంటు రాము గత నెల 26న నిర్మాతల్లో ఒకరైన అచ్చిబాబుపై కొందరు వ్యక్తులతో దౌర్జన్యానికి పాల్పడి ఆయనతో ప్రాంసరీ నోట్లు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకొన్నాడు.
     
     ఈ నేపథ్యంలో సదరు వ్యక్తులు గత మూడు రోజులుగా నిర్మాతను వేధిస్తున్నారు. నిర్మాతలు పరవాడలో విడిది చేసిన గెస్ట్‌హౌస్, సినిమా షూటింగ్ ప్రదేశాలకు వెళ్లి వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. బకాయిలను త్వరలో చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోకుండా తనపై దాడికి పాల్పడుతున్నారని నిర్మాత అచ్చిబాబు సోమవారం సినీ హీరో మంచు మనోజ్ వద్ద వాపోయాడు. మనోజ్ ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడానికి సోమవారం రాత్రి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడడంతో పరస్పరం పరవాడ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాలవారు ఫిర్యాదు చేసినట్లు పరవాడ సీఐ బి.సిహెచ్. స్వామినాయుడు ధ్రువీకరించారు.
     
     నిర్మాతలపై దౌర్జన్యం దారుణం
     నిర్మాతలపై విశాఖకు చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడడం దురదుష్టకరమని సినీ హీరో మనోజ్, దర్శకుడు అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నైజం కొనసాగితే సినిమా యూనిట్లు చెన్నైకి తరలిపోవడం ఖాయమన్నారు.  ప్రశాంతకు మారు పేరైన విశాఖలో నకిలీ యూనియన్ పేరుతో కొందరు వ్యక్తులు జూనియర్ ఆర్టిస్టులను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో సినీ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళతామన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement