అనాథగా మారిన బలిజిపేట పీహెచ్‌సీ | Sakshi
Sakshi News home page

అనాథగా మారిన బలిజిపేట పీహెచ్‌సీ

Published Thu, Jul 28 2016 12:13 AM

అనాథగా మారిన బలిజిపేట పీహెచ్‌సీ

సువర్ణముఖిలో కలిపేయండి
సిబ్బందిపై ఎమ్మెల్యే చిరంజీవులు మండిపాటు
 
బలిజిపేట రూరల్‌: ‘బలిజిపేట పీహెచ్‌సీ అనాథగా మారింది. ఇక్కడ వైద్యాధికారి ఉండరు. ఉన్న సిబ్బందిని ఏది అడిగినా తెలియదంటారు. రోగులకు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిన నాథుడే కనిపించటం లేదు. ఇదేం పీహెచ్‌సీ? దీన్ని నారాయణపురం వద్ద సువర్ణముఖి నదిలో కలిపేయండి.. అని మండిపడ్డారు పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు. ఆయన బుధవారం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యాధికారి లేరు. సూపర్‌వైజర్‌ రవిని ప్రశ్నించగా రెగ్యులర్‌ వైద్యాధికారి లేరని, వారంలో ముగ్గురు వైద్యులు మూడురోజులు వచ్చి ఓపీ చూస్తారని తెలిపారు. పీహెచ్‌సీ బాధ్యతలు ఎవరికి అప్పగించారని ప్రశ్నించగా ఎవరికీ అప్పగించలేదన్నారు. స్టాఫ్‌నర్స్‌ ఉమను ఎమ్మెల్యే పిలిచి రోజూ పత్రికలలో బలిజిపేట పీహెచ్‌సీపై ప్రచురిస్తున్న కథనాలపై ప్రశ్నించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి శారదకు ఫోన్‌ చేసి బలిజిపేట పీహెచ్‌సీకి పూర్తిస్థాయి వైద్యాధికారిని నియమించాలని కోరారు. పీహెచ్‌సీ దీనావస్థలో ఉందని, ఎవరినో ఒకరిని పంపించకపోతే కష్టమని వివరించారు. తాత్కాలికంగా బొబ్బిలి పీహెచ్‌సీ నుంచి సాహు అనే వైద్యాధికారిని పంపనున్నట్టు డీఎంహెచ్‌ఓ బదులిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పెంకి పార్వతి, జెడ్పీటీసీ రాధ, పీహెచ్‌సీ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు సుబ్బారావు, పి.సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement