ఖాజానా ఖాళీ | Sakshi
Sakshi News home page

ఖాజానా ఖాళీ

Published Fri, Nov 25 2016 10:56 PM

ఖాజానా ఖాళీ - Sakshi

  •  నగదు లేక ఎస్‌బీఐ ప్రధాన శాఖలో ఆగిన చెల్లింపులు
  • 16 రోజులైనా తప్పని తిప్పలు
  • అనంతపురం అగ్రికల్చర్‌:  పెద్ద నోట్ల రద్దుతో రోజురోజుకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. 16వ రోజు శుక్రవారం కూడా జిల్లా అంతటా ప్రజలు డబ్బు కోసం  ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద  పడిగాపులు తప్పలేదు. చాలా బ్యాంకుల్లో ఖాజానాలు ఖాళీ అయ్యాయి. రూ.100 నోట్లతోపాటు రూ.2 వేల నోట్లు కూడా అయిపోవడంతో చాలా చోట్ల బ్యాంకులను మూసివేశారు. ప్రధానంగా సాయినగర్‌లో ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రధాన శాఖలో శుక్రవారం మొదటి అరగంటలోనే నగదు నిల్వలు అయిపోయాయి. దీంతో అధికారులు చేతులెత్తేశారు.  కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడిన వందలాది మంది   అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్న మొత్తంతో వారికి నచ్చజెప్పి సర్దుబాటు చేశారు.  రూ.2 వేల నగదు మార్పిడిని నిలిపివేశారు.  రూ.2 వేలు, రూ.4 వేలు, గరిష్టంగా రూ.10 వేలకు చెల్లింపులు పరిమితం చేశారు.  రూ.2 వేల నోట్లు కొరత కూడా ఎక్కువగా ఉండటంతో శుక్రవారం ఏటీఎంలు నామమాత్రంగా పనిచేశాయి. సోమ లేదా మంగళవారం రూ.500 నోట్లు రావచ్చునని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నెల 10  నుంచి రూ.800 కోట్ల వరకు ప్రజలకు పంపిణీ  జరిగిందని, ఈ డబ్బు మార్కెట్‌లోకి రాకపోవడంతో   సమస్య మరింత జఠిలమవుతోందని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు. రూ.300 కోట్లు వరకు కొత్త రూ.100 నోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. అందులో 10 శాతం కూడా ప్రజల మధ్య మార్పిడి జరగలేదంటున్నారు.

    సామాన్యులకే   కష్టాలు

     ఎస్‌బీఐ, ఏపీజీబీ, సిండికేట్‌బ్యాంకు, కెనరా, ఆంధ్రాబ్యాంకుల్లో  అకౌంట్లు ఉన్న  పేదలు, రైతులు, కూలీలు, సామాన్య, మధ్య తరగతివారు అవస్థలు పడుతున్నారు. బడాబాబులు, వ్యాపార, ఉద్యోగ వర్గాల అకౌంట్లు ఎక్కువగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్‌ బ్యాంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. డబ్బు కోసం స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వచ్చి గంటల తరబడి నిలబడిన ఆర్‌డబ్లూఎస్‌ ఉద్యోగి ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

     

    శని, ఆది బ్యాంకులకు సెలవు:

     శని, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకర్లకు కాస్త ఉపశమనం కలుగుతోంది. అదే సమయంలో ప్రజల ఇబ్బందులు రెట్టింపు అయ్యే సరిస్థితి ఉంది.  ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు.  శని, ఆదివారం రోజుల్లో నగదు వస్తే కొంత ఊరట కలుగుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.

Advertisement
Advertisement