బాపు మాట.. అదే మా బాట | Sakshi
Sakshi News home page

బాపు మాట.. అదే మా బాట

Published Sat, Oct 1 2016 9:49 PM

1938లో రాజకీయ పాఠశాల విద్యార్థులు (ఫైల్‌)

* మంతెనవారిపాలెంలో గాంధీజీ అడుగుజాడలు
స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న
మంతెనవారిపాలెం గ్రామస్తులు  
 
మంతెనవారిపాలెం (పిట్టలవానిపాలెం): బ్రిటీష్‌ సామ్రాజ్య కబంద హస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పించడంలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలుగు తేజం మంతెన వెంకట్రాజు. మహాత్ముని శాంతి మంత్రమే బ్రహ్మోపదేశంగా ఆయన అడుగుజాడల్లో నడిచిన మహనీయుడు ఆయన. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయులను ఒక్కసారి స్మరించుకుందాం.  
 
1927లో మంతెనవారిపాలెంలో గాంధీజీ బస..
స్వాతంత్య్ర సమరంలో జాతిపిత మహాత్మాగాంధీని మంతెనవారిపాలెం గ్రామానికి తీసుకొచ్చిన ఘనత మంతెనకే దక్కింది. ఈ గ్రామంలో కనుమూరి వెంకట్రాజు ఇంట్లో రెండు రోజులపాటు బస చేసిన గాంధీజీ గుర్తుగా పాఠశాల ఆవరణలో సమారు 20 అడుగుల ఎత్తులో గాంధీజీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. నాడు గాంధీజీ బస చేసిన కనుమూరి ఇల్లు గ్రామంలో నేటికీ దర్శనమిస్తుంది. అప్పటి నుంచి ఆ ఇంటిని అందుకు చిహ్నంగా నూతన రంగులతో అలంకరించుకుంటున్నారు. గ్రామంలో మంతెన వెంకట్రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాంస్య, తామ్ర పత్రాలు పొందిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను అక్కడ చిత్రీకరించారు. అవి నేటికీ దర్శనమిస్తాయి. 
 
రాజకీయ పాఠశాల 
జాతీయస్థాయిలో ప్రప్రథమంగారాజకీయ పాఠశాల నిర్వహించిన ఘనత మంతెనకే దక్కుతుంది. 1938లో ఏర్పాటైన రాజకీయ పాఠశాలను మహాత్మాగాంధీ ప్రారంభించారు. అక్కడ ప్రసంగించిన ఆయన రెండు రోజులపాటు బస చేయడం విశేషం. రాజకీయ పాఠశాలలో నేడు రాజకీయాల్లో ఉద్దండులుగా వెలుగొందిన పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు శిక్షణ పొందారు. వీరిలో అఖిల భారత కమ్యూనిస్ట్‌ నాయకుడు ఎస్‌.ఎ. డాండే, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన కమ్యూనిస్ట్‌ నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొల్లా వెంకయ్య, మోటూరి హనుమంతరావు, కొండపల్లి సీతారామయ్య, మాకినేని బసవపున్నయ్య, దత్తు మజుందర్, జాతీయ నాయకుడు జయప్రకాష్‌నారాయణ తో పాటు సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఆచార్య ఎన్‌జీ రంగా వంటి ప్రముఖులు ఉన్నారు. 

Advertisement
Advertisement