ఒక్కేసి పువ్వేసి.. | Sakshi
Sakshi News home page

ఒక్కేసి పువ్వేసి..

Published Mon, Oct 12 2015 3:02 AM

ఒక్కేసి పువ్వేసి.. - Sakshi

 నేటి నుంచి బతుకమ్మ.. పల్లె, పట్నాలకు పండుగ కళ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇద్దరక్కజెల్లెల్లు ఉయ్యాలో... ఒక్కూరిచ్చిండ్లు ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో... వచ్చన్నబోడాయె ఉయ్యాలో ఎట్లస్తు చెల్లెల  ఉయ్యాలో... ఏరడ్డమాయె ఉయ్యాలో..!   ...ఇలాంటి ఎన్నో బతుకు పాటలతో తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించే ప్రకృతి పండుగ వ చ్చేసింది! తెలంగాణ సంస్కృతిని, పల్లె జీవనశైలిని పాటలతో చాటి చెప్పే బతుకమ్మ సోమవారం ఎంగిలిపూలతో మొదలై ఈ నెల 20న సద్దులతో ముగియనుంది. తెలంగాణలో బతుకమ్మను ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారు. అందుకే ఆడబిడ్డ పండుగకు రాకపోతే అవమానంగా భావిస్తారు.

ఆడబిడ్డను శుక్రవారం, బుధవారం పుట్టింటి నుంచి పంపరు. అందుకే సద్దుల బతుకమ్మను.. శుక్రవారం, బుధవారం జరపరు. తిథి ప్రకారం ఈ రోజుల్లో సద్దుల బతుకమ్మ వచ్చినా మరుసటి రోజు నిర్వహిస్తారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అధికారికంగా బతుకమ్మ నిర్వహణ కోసం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి గ్రామంలోనూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా బతుకమ్మ పండుగతో తెలంగాణలోని పల్లె, పట్టణం, ప్రతి ఊరు ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంటోంది.
 
 తెలంగాణ వాసులు ఎక్కువగా ఉండే ముంబై, భీవండీ, సూరత్‌లలో కూడా ఉత్సవాల నిర్వహణ కోసం స్థానికులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇవ్వనుంది. విదేశాలకు సైతం పండుగను పరిచయం చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో 15, 16 తేదీల్లో తెలంగాణ భవన్, పీహెచ్‌డీ చాంబర్ లో నిర్వహించే ఉత్సవాలకు విదేశీ రాయబారుల ను ఆహ్వానిస్తోంది. ఇక రాజ ధాని హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. సద్దుల బతుకమ్మ రోజు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు మహిళా కళాకారులతో భారీ ఊరేగింపు నిర్వహించి, ట్యాంక్‌బండ్‌పై ముగింపు ఉత్సవం జరపనున్నారు.
 
 ఘనంగా నిర్వహించాలి
 సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలను ఎలాంటి లోపాలు లేకుండా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. పండుగ నిర్వహణపై ఆదివారం హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లోజరిగిన సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి చందూలాల్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు తదితరులు పాల్గొన్నారు.
 
 ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే ముగింపు వేడుకను గత సంవత్సరం కంటే అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. కాగా, ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సమావేశానికి ఎంపీ కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ 11.30 వరకు ఆమె రాకపోవటంతో సమావేశాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన కవిత వేదిక వరకు రాకుండానే.. సమావేశం ప్రారంభమైందని తెలుసుకుని వెనుదిరిగి వెళ్లిపోయారు. వేరే ముఖ్యమైన కార్యక్రమం ఉండటం వల్లనే ఆమె నిష్ర్కమించారని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement