బీసీ రిజర్వేషన్ల సాధనకు సిద్ధంకండి | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్ల సాధనకు సిద్ధంకండి

Published Fri, Aug 26 2016 9:42 PM

బీసీ రిజర్వేషన్ల సాధనకు సిద్ధంకండి - Sakshi

జిల్లా కాపు ఏజేసీ
కాకినాడ రూరల్‌ :
కాపులను బీసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన కాలపరిమితి దగ్గర పడుతున్నందున బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రతి కాపు సిద్ధం కావాలని జిల్లా కాపు ఏజేసీ పిలుపునిచ్చింది. శుక్రవారం సాయంత్రం శశికాంత్‌నగర్‌లోని కాపు కల్యాణమండపంలో జిల్లా కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా కాపు జేఏసీ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. పోరాటం ద్వారానే కాపులు ప్రత్యేక కార్పొరేషన్‌ను సాధించుకోగలిగామన్నారు. బీసీ రిజర్వేషన్లపై వేసిన మంజునాథన్‌ కమిటీ రిపోర్టు ఆగస్టు 31నాటికి ఇవ్వాల్సిన్నా నేటి వరకు మంజునాథన్‌ కమిటీ ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదన్నారు. జిల్లాల్లోని కాపులందరినీ సమాయత్తం చేస్తూ ఇప్పటికే 11 జిల్లాల్లో కాపు జేఏసీలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరాల్లో జేఏసీలు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇవి కూడా ఈ నెలాఖరునాటికి పూర్తి చేసి 13 జిల్లాల జేఏసీల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 13న రాజమండ్రిలో ప్రత్యేక కాపు గర్జన నిర్వహిస్తున్నట్టు జేఏసీ ప్రతినిధుల సమావేశం ప్రకటించింది. కాపు ఉద్యమనేతపై చంద్రబాబు తమ మంత్రులను కావాలనే ఉద్దేశపూర్వకంగా అవాకులు, చవాకులతో విమర్శలు చేయిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. కాపులను రెచ్చగొట్టేధోరణిలో మంత్రుల తీరు ఉందని, శాంతిభద్రతలే ముఖ్యమని ప్రకటిస్తున్న మంత్రులు గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్పలే ప్రత్యేక కారణమన్నారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమించే సమయంలో జరిగిన చిన్న పొరబాటును బూతద్దంలో చూపించి 300 మంది కాపు ప్రతినిధులను ఇప్పటికీ వేధిస్తున్నారు. 13 జిల్లాల్లో తాము సేకరించిన బీసీ రిజర్వేషన్ల వివరాలను మంజునాథన్‌ కమిటీకి సమర్పిస్తామన్నారు. సమావేశంలో జిల్లా కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ, గుంటూరు నుంచి చందు జనార్దన్, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఆరేటి ప్రకాష్, కాపు నాయకులు సంగిశెట్టి అశోక్, రావూరి వెంకటేశ్వరరావు, పేపకాయల రామకృష్ణ, బసవా ప్రభాకరరావు, పసుపులేటి చంద్రశేఖర్, ఉండా వెంకటరమణ, గొల్లపల్లి బాబులు, రంబాల వెంకటేశ్వరరావులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది కాపు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement