అక్టోబర్‌ లోపు భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ లోపు భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి

Published Tue, Sep 13 2016 12:00 AM

మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు - Sakshi

  • 60 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
  • 36 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణ పనులు పూర్తి 
  • అధికారుల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌ : భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణ పనులను అక్టోబర్‌ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రోడు,్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంలోని టీటీడీసీ భవన్‌లో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 36 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణ పనులు పూర్తి  అయ్యాయని మిగత 8 కిలో మీటర్లు పనులు నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు.సీతారామ ప్రాజెక్టు మూడు ప్యాకేజీ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి కావడంతో భూసేకరణ జరిగిన ప్రాంతాలలో నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి ప్రగతి వివరాలను ప్రతి వారం కలెక్టర్‌కు అందజేయాలని అధికారులకు సూచించారు. తిరుమలాయపాలెం మండలంలో ఏడు పంచాయతీలలో 14 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. నాగార్జున సాగర్‌ ద్వారా నీరు అందించకపోతే దానికి గల కారణాలను రైతులకు తెలియజేసి వారు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకొవడానికి వ్యవసాయ, ఎన్నెస్పీ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎన్నెస్పీ ఆధునీకీకరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో సంబంధిత అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.  కూసుమంచి వద్ద బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో వంతెన నిర్మాణానికి ఎన్నెస్పీ,ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. పాలేరు నియోజకవర్గంలో మిషన్‌ భగీరథలో అన్ని గ్రామాలకు నీరు అందించేందుకు వచ్చే నెల వరకు పనులు పూర్తి చేయాలన్నారు.తిరుమలాయపాలెం మండలాన్ని మోడల్‌గా తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సమస్య తలెత్తకుండా ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గడిపల్లి కవిత, ఎస్పీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్, జేసీ దివ్య వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
     
     

Advertisement

తప్పక చదవండి

Advertisement