భూమా బంధువుల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

భూమా బంధువుల దౌర్జన్యం

Published Mon, Nov 21 2016 10:58 PM

భూమా బంధువుల దౌర్జన్యం

 బాధితులకు న్యాయం చేయాలని  టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్‌
-  జేసీ2కు ఫిర్యాదు 
– మీకోసంకు వెల్లువెత్తిన వినతులు 
కల్లూరు (రూరల్‌): ఆళ్లగడ్డ మండలం పి. చింతకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1562, 1564లో దళితులు సాగుచేసుకుంటున్న  ఏడబ్ల్యూ ల్యాండ్‌ను  అధికారపార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బంధువులు భూమా రుద్రారెడ్డి, గనిశ్రీను మరికొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద​ృష్టికి సైతం తీసుకెళా​‍్లను.  మీరైనా స్పందించి రెవెన్యూ రికార్డులోని ఆర్‌ఓఆర్‌లో ఉన్న దళితుల భూములను కాపాడి  బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డాలు రత్నమయ్య జిల్లా అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి  జేసీ సి. హరికిరణ్, జేసీ2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌  వినతులు స్వీకరించారు.  అందులో..
 
– సర్వే నంబర్‌ 367/ఏ లోని ఎకరన్నర పొలాన్ని సర్వే చేయాలని ఏడు నెలలుగా వెల్దుర్తి తహసీల్దార్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం  లేదని వి. తిమ్మయ్య శెట్టి జేసీకి ఫిర్యాదు చేశారు. 
– డోన్‌ మండలం కమలాపురం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్‌ ఆర్‌ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్‌ఎస్‌ రామకృష్ణారెడ్డి తదితరులు అధికారులకు విన్నవించారు. 
– కొర్రబియ్యం విక్రయానికి  కలెక్టరేట్‌ ఆవరణం, సీ క్యాంపు రైతు బజార్‌లో షాపు కేటాయించాలని  తెర్నేకల్లు వాసులు నాగభూషణం, జనార్దన్‌ కోరారు.
–  పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని  తమదంటూ  చాకలి శేషన్న కుమారుడు చిన్న నరసింహులు  దౌర్జన్యం చేస్తున్నాడని  మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన  నల్లబోతుల బోడెన్న తెలిపారు.
– పగిడ్యాల మండలం ప్రాతకోట,  వనములపాడు, నందికొట్కూరు మండలం 10 బొల్లవరంలో డీలర్ల నియామకానికి నిర్వహించిన రాతపరీక్షలో ముగ్గురు ఎంపికయ్యారని. అయితే వారిని కాదని ఇతరులకు  రేషన్‌షాపులు కట్టబెట్టారని కొందరు జేసీని కలిసి ఫిర్యాదు చేశారు.  
– గ్రూపు 2, 3 పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఐక్య వేదిక నాయకులు తగ్గుపర్తి రామన్న, మహరాజ్, రాము, మల్లేష్, దివాకర్, వలి, సోము, ప్రసాద్, రాజేష్, దాసు జేసీకి ఫిర్యాదు చేశారు. 
 
పరిహారం ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండి
– రక్షణ శాఖకు కేటాయించనున్న ఓర్వకల్లు మండలం పాలకొలనులోని సర్వే నంబర్లు 99, 232,235, 250,252, 250లలోని 186 ఎకరాల భూమికి ఎకరాకు రూ.1.80లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని జేసీ హరికిరణ్‌ బాధిత రైతులకు వెల్లడించారు. తాము అందుకు అంగీకరించమని భూములు కోల్పోయే రైతులు సుధాకర్‌రెడ్డి మరికొందరు మీకోసం కార్యక్రమంలో జేసీని విన​‍్నవించారు. ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్లిపోండని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అరెస్ట్‌ చేసి లోపలేయండని స్థానిక పోలీసులకు ఆదేశించారు. దీంతో బాధితులు, జేసీ మధ్య  కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్పమాలలో ఉన్న తనను కనీస మర్యాద లేకుండా జేసీ మాట్లాడుతున్నారని, వారికి భయపడి భూములు అప్పగించే ప్రసక్తే లేదని  సుధాకర్‌రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement