అందని బిల్లులు | Sakshi
Sakshi News home page

అందని బిల్లులు

Published Sun, Sep 18 2016 9:27 PM

పాపన్నపేటలో చెట్ల కిందే వంట

  • మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులేవి
  • అప్పుల పాలవుతున్న ఏజెన్సీ మహిళలు
  • 3 నెలలుగా బిల్లులు రాక అవస్థలు
  • పాపన్నపేట: మధ్యాహ్న భోజన బిల్లులు పెంచినప్పటికీ వాటి చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో ఏజెన్సీ మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ మూడు నెలల బిల్లులు రాక వంటలు చేసేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు. పాపన్నపేట మండలంలో 61 పాఠశాలలున్నాయి.

    ప్రతి రోజు సుమారు 6 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. అయితే ఏజెన్సీ మహిళలకు కనీస సౌకర్యాలు లేక ..బిల్లులు సకాలంలో రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సారి వలసలను నివారించాలనే లక్ష్యంతో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనాలు అందజేశారు. వాటికి సంబంధించి ఇటీవలే బిల్లులు వచ్చాయి.

    అయితే మండలంలో ఇప్పటి వరకు జూన్‌ నెల నుంచి వంట బిల్లులు రాలేదు. దీంతో కిరాణం సామానుకు కష్టమవుతుందని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాన్ని గ్రహిస్తు గ్రామాల్లోని కిరాణం దుకాణాల యాజమానులు సామానుకు రేట్లు ఎక్కువ వేసి ఉద్దెర ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    నెల దాటగానే బిల్లులు చెల్లించక పోతే వాటికి వడ్డీ కూడా వేస్తున్నారని తెలిపారు. దీంతో తాము చేసిన వంటలకు వచ్చే బిల్లులు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు.ముఖ్యంగా తక్కువ విద్యార్థు«లున్న స్కూళ్లలో వంట బిల్లులు సరిపోవడం లేదని చెపుతున్నారు.పొద్దంతా కష్టపడే తమకు జీతాలు మాత్రం రూ.1000 చెల్లించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    రోజుకు రూ.50 కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు.నెలకు కనీసం రూ.3000 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.అలాగే సుమారు 45 పాఠశాలల్లో వంట గదులు లేక ఆరుబయట వంటలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు తెలిపారు.వంట గదులు మంజూరైనట్లు చెపుతున్నా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదని వాపోతున్నారు.

    ఈ విషయమై ఎంఇఓ మోహన్‌రాజు మాట్లాడుతు జూన్‌ నెల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.వంట గదులు మంజూరయ్యాయని వాటి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.

Advertisement
Advertisement