బయోమెట్రిక్ అమలయ్యేనా..? | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్ అమలయ్యేనా..?

Published Mon, Dec 5 2016 3:07 AM

బయోమెట్రిక్ అమలయ్యేనా..? - Sakshi

మిర్యాలగూడ టౌన్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు బయోమెట్రిక్ విధానం అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందుకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా ఈ ప్రాజెక్టు పరిధిలో 2059 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టులో చాలా మంది సూపర్‌వైజర్లు డిప్యూటేషన్‌పైనే ఉంటున్నారు. నూతన సాంకేతిక వ్యవస్థ ద్వారా పోషకాహార లేమితో బాధపడే చిన్నారుల పరిస్థితులను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో అధికారులు తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నారుు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎంత మంది వస్తున్నారు. 
 
 వారికి పౌష్టికాహారం అందుతుందా..లేదా.. వర్కర్లు సమయానికి కేంద్రానికి వస్తున్నారా..లేదా అని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మాతా శిశు సంరక్షణ కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ఫలితం లేకుండా పోయింది. అంగన్‌వాడీ కేంద్రాలకు అందించే పౌష్టికాహార వివరాలు, పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలు, వ్యాధి నిరోధక టీకాలు, భ్రుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల వివరాలు, ఆరోగ్యలక్ష్మి, జన, మరణాలు, కిశోర బాలికలు, బాలామృతం, 0-6 నెలల పిల్లలు, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లల వివరాలతో పాటు ఐసీడీఎస్‌కు సంబంధించిన పథకాలను ఇంటర్నెట్‌లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
 
 డిజిటలైజేషన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
 అంగన్‌వాడీ కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిజిటలైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టిని సారించనున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అన్నీ చర్యలను చేపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం, ఆరోగ్యలక్ష్మి పథకాలను పడక్భందీగా అమలు చేసేందుకు ఆయా కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు బాలబాలికలందరికి ఆధార్‌కార్డులను జారీ చేయనున్నది. అదే విధంగా బాలింతలు, గర్భిణులు హాజరును తెలుసుకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నది. 
 
 ఈ నూతన విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తెలంగాణాలోని అన్నీ అంగన్‌వాడీ కేంద్రాల్లోఅమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. మీ సేవ కేంద్రాల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాలు బాలలకు ఆధార్‌కార్డులను జారీ చేయనున్నారు. వాటి ఆధారంగానే ఆహార పదార్థాలు, రేషన్ సరుకుల అక్రమాలకు పాల్పడకుండా ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్  విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. కేంద్రాల్లో నమోదు అయిన గర్భిణులు, బాలింతల్లో కొంత మంది హాజరు కాకపోవడంతో  సరుకులు పక్కదారిపడుతున్నారుు. ఈ విధానం పడక్భందీగా అమలు అయితే అంగన్‌వాడీ వ్యవస్థకు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం త్వరలో అందజేయనున్న ల్యాబ్ ట్యాబ్‌లు, బయోమెట్రిక్ విధానాలపై ప్రతి అంగన్‌వాడీ వర్కర్‌కు శిక్షణ ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.
 
 ఎలాంటి సమాచారం రాలేదు
 ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ ల్యాప్‌ట్యాప్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ జిల్లాల విభజన తర్వాత ఈ విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ప్రభుత్వం బయోమెట్రిక్, ల్యాబ్ ట్యాప్‌ల ఏర్పాటుపై చర్యలు తీసుకుంటే తప్పని సరిగా ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేస్తాం.
 - పుష్పలత, జిల్లా సంక్షేమ అధికారిని
 

Advertisement
Advertisement