Sakshi News home page

మూగబోయిన కిలకిలరావాలు

Published Thu, Dec 22 2016 1:58 AM

మూగబోయిన కిలకిలరావాలు

 
సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో పలుమార్లు తుపాన్లు, అల్పపీడనాలు వచ్చినా సరైన వర్షాల్లేకపోవడంతో ఆశించిన రీతిలో విదేశీ వలస విహంగాలు రాలేదు. సరస్సులో నీళ్లు తక్కువగా ఉండటంతో ఫ్లెమింగోలు మాత్రమే గుంపులు గుంపులుగా చేరి దర్శనమిస్తున్నాయి. సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పులికాట్‌ సరస్సు, నేలపట్టు చెరువు నిండా నీళ్లు చేరితే సుమారు 158 రకాల విదేశీ వలస విహంగాలు సుమారు ఆర్నెల్ల పాటు విడిది చేసి సంతానోత్పత్తి చేసుకొని వెళ్లేవి. ఈ ప్రాంతంలో వర్షాలు కురిసి నీళ్లు సమృద్ధిగా చేరాయా.. లేదానని రెండు పక్షులు పైలెట్లుగా వచ్చి చూసి వెళ్లి అంతా బాగుంటే మిగిలిన పక్షులను పిలుచుకొని వస్తాయని వీటిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. ప్రస్తుతం ఫ్లెమింగోలు, పెయింటెడ్‌ స్టార్క్స్‌ మాత్రమే అక్కడక్కడా కనిపిస్తున్నాయి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని స్థావరంగా చేసుకొని సంతానోత్పత్తి చేసే పెలికాన్‌ పక్షులు నేలపట్టులో కనిపించకపోగా, పులికాట్‌  సరస్సులో వేళ్లమీద లెక్కపెట్టే పక్షులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మొత్తానికి వర్షాభావంతో ఈ సారి పక్షులు లేకుండానే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండటం విశేషం. 
జాలర్ల ఆందోళన
ఫ్లెమింగో పండగ వల్ల పులికాట్‌ సరస్సుకు గానీ, పక్షులు నివసించేందుకు గానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనప్పుడు పండగ ఎందుకని పులికాట్‌ జాలర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మత్స్యకారులు అందరూ పండగను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో పులికాట్‌ జాలర్లను కూడా భాగస్వాములను చేసి సరస్సులో పడవ పందేలను నిర్వహించి వారికి నగదు బహుమతులను అందజేసేవారు. అయితే వీరి మధ్య వివాదాలు వస్తున్నాయనే కారణంగా పడవ పందేలను రద్దు చేశారు. తడ మండలంలోని తడ, భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్‌ షికారును ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత బోట్‌షికార్‌ తడ పడవల రేవులో రద్దు చేసి బీవీపాళెంలోనే ఏర్పాటు చేశారు. బీవీపాళెం పడవల రేవులో బోట్‌ షికారుకు తప్ప మత్స్యకారులను ఎక్కడా భాగస్వామ్యులను చేయకపోవడంతో పండగను బహిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement