బీజేపీలో ’అమితా’నందం | Sakshi
Sakshi News home page

బీజేపీలో ’అమితా’నందం

Published Sat, Nov 26 2016 11:51 PM

బీజేపీలో ’అమితా’నందం - Sakshi

రైతు సభ సక్సెస్‌తో విస్తుపోయిన టీడీపీ
 చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించడంతో కమలనాథుల అసంతృప్తి
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాడేపల్లిగూడెం :
బీజేపీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ రన్‌వే వద్ద శనివారం నిర్వహించిన బీజేపి రైతు మహాసభకు వివిధ జిìæల్లాల నుంచి రైతులు, కార్యకర్తలు తరలిరావడం కమలనాథుల్లో ఉత్సాహం నింపింది. బీజేపీకి జిల్లాలో బలం లేదని, వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాల్సి వస్తే తాడేపల్లిగూడెం సీటు కూడా వారికి ఇవ్వకుండా చేయాలని భావించిన తెలుగుదేశం నాయకులకు ఈ సభ విజయవంతం కావడం మింగుడు పడటం లేదు. జనం రాకుండా చేయాలని అధికార పక్షం భావించినా.. కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జన సమీకరణకు దిగడంతో సభ సక్సెస్‌ అయ్యింది. అయితే, ఇంత కష్టపడినా.. టీడీపీ అధినేతపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేశాయి. పెద్దనోట్ల రద్దు విషయంలో శత్రుపక్షంలా వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు తీరుపై స్పందించకుండా.. ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం పొగడటం కమలనాథులకు మింగుడు పడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో అమిత్‌షా కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్ధించుకునేలా మాట్లాడారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తామే నిధులిచ్చామని,  ప్యాకేజీలో ప్రకటించిన అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు. బీజేపీ రైతు లోకానికి అండగా ఉంటుందని, కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కొల్లేరు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పడం ద్వారా తాము రైతుల పక్షాన ఉన్నామనే ప్రయత్నం చేశారు. సభకు ముందు మిత్రపక్షం నుంచి కొంత తలనొప్పులు వస్తాయని, పెద్దనోట్ల రద్దు అంశంపై జనం నుంచి నిరసనలు వస్తాయని భావించారు. అలాంటి అవకాశం లేకుండా సభ సాఫీగా సాగడం బీజేపీ నేతలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్, బీజేపీ నేతలు యూవీ కృష్ణంరాజు, కనుమూరి రఘురామకృష్ణంరాజు వంటి నేతలు వేదికపై ఉన్నా వారికి మాట్లాడే అవకాశం దక్కలేదు. సాయంత్రం 4.44 గంటలకు సభా వేదికపైకి వచ్చిన అమిత్‌షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సభానంతరం అమిత్‌షా ఇతర అతిథులు మంత్రి మాణిక్యాలరావు ఆతిథ్యాన్ని స్వీకరించి రాత్రి 7.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement