సీటు.. హాటు.. | Sakshi
Sakshi News home page

సీటు.. హాటు..

Published Wed, Aug 9 2017 11:11 PM

సీటు.. హాటు.. - Sakshi

బీజేపీ, దేశం మధ్య కుదరని సయోధ్య
సీట్ల పంపకాలపై మల్లగుల్లాలు
20 సీట్లు కావాలంటున్న బీజేపీ
ససేమిరా అంటున్న దేశం
సంకటస్థితిలో అభ్యర్థులు
కాకినాడ : కార్పొరేషన్‌ ఎన్నికలు అధికార టీడీపీకి ప్రాణసంకటంగా మారాయి. ఏదోవిధంగా ఎన్నికలు వాయిదా వేయించాలన్న వారి పాచిక పారక పోగా, సీట్ల పంపకాలు అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయంటున్నారు. బీజేపీతో పొత్తు ఉంటుందని దేశం నేతలు ప్రకటించగా ప్రస్తుతం బీజేపీ, దేశం మధ్య సీట్ల పంపకాల్లో సయోధ్య కుదరకపోవడంతో ఇక నామినేషన్లకు కేవలం 20 గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఆయా పార్టీల ఆశావాహులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్న 48 డివిజన్లలో 20 సీట్లు తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పొత్తుపై తీవ్ర తర్జనభర్జనలు పడుతుండగా బుధవారం రాత్రికి కూడా సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారంటున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎన్నికల పరిశీలకుడు బీజేపీ విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు బీజేపీ తరఫున సీట్ల కేటాయింపుపై మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలతో తిమ్మాపురంలో జరిపిన చర్చలు విఫలమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేస్తుండడంతో పొత్తులో సీట్ల కేటాయింపు తేలకుండా వేయడమేమిటని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది, అందుకే సీట్ల కేటాయింపు తేలే వరకూ ఆగకుండా గురువారం ఉదయం తాము కోరుతున్న డివిజన్లలో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించడానికి బీజేపీ నేతలు సిద్ధపడినట్టు చెబుతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లలో బీజేపీ అభ్యర్థులు తలమునకలైనట్టు తెలిసింది. కేవలం 5 నుంచి ఏడు సీట్లు మాత్రమే ఇస్తామని దేశం నేతలు చెబుతుండడంతో దానికి అంగీకరించని బీజేపీ నేతలు కనీసం 12 సీట్లు అయినా ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది.  గురువారం ఉదయానికి సీట్ల పంపకం ఒక కొలిక్కి రాకపోతే ఇరు పార్టీలకు రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement