నల్ల‘మందు’తో తెల్ల‘ధనం’ | Sakshi
Sakshi News home page

నల్ల‘మందు’తో తెల్ల‘ధనం’

Published Thu, Nov 17 2016 2:42 AM

నల్ల‘మందు’తో తెల్ల‘ధనం’

బెల్టుబాబు డెరైక్షన్.. సిండికేట్ సభ్యుల యాక్షన్
  మద్యం సిండికేటు నయాదందా
  మూడు రోజులుగా పాతనోట్లు తీసుకోని లిక్కర్ వ్యాపారులు
  కానీ ఆదాయ లెక్కల్లో.. బ్యాంకు జమల్లో మాత్రం అవే
  బ్లాక్‌ను వైట్ చేసుకునే పనిలో బిజీబిజీ
 
పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు ఎక్కడా.. ఎవరూ తీసుకోకపోయినా.. వైన్ షాపులు, బార్లలో మాత్రం కళ్లకద్దుకొని తీసుకున్నారు. బోర్డులు పెట్టి మరీ ఆహ్వానించి మందుబాబులను ఊరించారు.. ఆదాయం కిక్కు పెంచుకుందమనుకున్నారు.. నోట్లు రద్దయిన రెండు మూడు రోజుల వరకు అదే జరిగింది కూడా..కానీ ఆ తర్వాతే సీను మారిపోయింది. మందుబాబులకు బంపర్ ఆఫర్ అందకుండాపోయింది. లిక్కర్ వ్యాపారులు పాత నోట్లు తీసుకోవడం మానేశారు..ఉన్న పళంగా వారి వైఖరిలో ఈ మార్పునకు కారణమేంటి?!.. ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూశాయి.దాని వెనుక ఓ బెల్టుబాబు మాస్టర్‌మైండ్ ఉందని.. అందులో నల్లడబ్బును మద్యంలో ముంచి తెల్లగా మార్చేసుకోవాలన్న స్వార్థపూరిత ఆలోచనలున్నాయని తేటతెల్లమైంది.మన దగ్గరే గుట్టలు గుట్టలుగా పాత పెద్దనోట్లు ఉండగా.. జనం నుంచి తీసుకోవడమెందుకు?.. వారి నుంచి కొత్త నోట్లే తీసుకొని.. వాటి స్థానంలో పాత నోట్లను చెల్లుబాటు చేసుకోవాలన్న దురాలోచన ఆ బెల్లుబాబుదే.. ఫలితం.. సిండికేట్ పరిధిలోని షాపులవారు పాత నోట్లకు ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను వెనక్కి తీసేసుకున్నారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 
విశాఖపట్నం: నోట్ల కట్టలు.. గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.. ఇప్పుడవన్నీ బయట చెల్లుబాటు కావు.  ఈ బ్లాక్‌ను ఎలా వైట్ చేసుకోవాలి?!.. ప్రధాని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇదే విషయమై మథనపడిన నగరంలోని లిక్కర్ సిండికేట్ లీడరు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి అలియాస్ బెల్టుబాబుకు ఎట్టకేలకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే తనవారందరికీ మార్గదర్శనం చేశారట. వైన్‌షాపులు, బార్లలో ఇక వినియోగదారుల నుంచి పాత రూ.500, వెయ్యి నోట్లు తీసుకోకుండా కొత్త 2వేల రూపాయల నోటు, లేదా రూ.వంద100, రూ.50 నోట్లు మాత్రమే తీసుకోవాలని లోపాయికారీగా ఆదేశాలు జారీ చేశారు. అలా వచ్చే రోజూవారీ వసూళ్ల స్థానంలో  పాత నోట్ల కట్టలను తీసుకొచ్చి ఆదాయం లెక్కల్లోచూపించేస్తే.. బ్లాక్‌లో ఉన్న కొంత సొమ్మయినా వైట్ చేసుకునే వీలుంటుందని సదరు బెల్టుబాబు లెక్కట. అందుకే ఇప్పుడు నగరం, నగర శివారులోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొత్త నోట్లు మాత్రమే తీసుకుంటామని బోర్డులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రం రూ.500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆయా నోట్లను తీసుకునేది లేదంటూ బోర్టులు పెట్టేశాయి. కానీ విశాఖ నగరం, శివారులోని మద్యం షాపులు, బార్ల యజమానులు మాత్రం పాత నోట్లను తీసుకుంటామని బోర్డులు పెట్టి మరీ మందుబాబులను ఆహ్వానించారు.

బ్లాక్ టు వైట్‌కు ఇదే అదను..
నగరంలోని లిక్కర్ వ్యాపారుల తరఫున దళారీగా వ్యవహరించే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి నల్లధనాన్ని వైట్ చేసుకోవాలంటే ఇదే సరైన సమయమని భావించాడు. అందుకే రోజూవారీ ఆదాయంలో భాగంగా పాత నోట్లను తీసుకోకుండా కేవలం కొత్త రూ.2వేల నోట్లు, వందలు, యాభైలు, చిల్లర మాత్రం తీసుకోవాలని సిండికేట్ వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశాడని అంటున్నారు. రోజువారీ లావాదేవీల్లో వచ్చే సొమ్మును ఎలాగూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం గొడౌన్‌లోనో.. బ్యాంకుల్లోనో చెల్లిస్తారు కనుక వైట్ అయిపోతుందన్నది ఆయనగారి వ్యూహం. ఆ మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద పాతనోట్లు చెల్లవని బోర్డులు పెట్టేశారు. విశాఖ, నగర శివారుల్లో కలిపి దాదాపు 110 మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. సగటున రోజుకి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. వాస్తవానికి గత వారంరోజులుగా సరైన విక్రయాలు లేక రోజూవారీ ఆదాయం ఒకింత తగ్గింది. అయితే రోజూవారీ ఆదాయం పది కోట్లుపైగా చూపిస్తూ ఇప్పటికే భారీమొత్తంలో బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని చెబుతున్నారు.

బెల్టుబాబుతో సహా సిండికేట్ సభ్యులు దాచుకున్న మొత్తం సొమ్ము వైట్ చేసుకోలేకపోయినా.. కొంతలో కొంత మార్పిడి చేసుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. సహజంగానే బెల్టుబాబు అలియాస్ టీడీపీ ప్రజాప్రతినిధి దెబ్బకు.. వైన్‌షాపుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకోవడం తప్ప మిగిలిన వాటి జోలికిపోని ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్లే నిద్ర నటిస్తున్నారు.

Advertisement
Advertisement