నల్లబజారుకు నీలి కిరోసిన్‌ | Sakshi
Sakshi News home page

నల్లబజారుకు నీలి కిరోసిన్‌

Published Sat, Oct 15 2016 10:32 PM

నల్లబజారుకు నీలి కిరోసిన్‌ - Sakshi

– పేదోడి కిరోసిన్‌ పెద్దోళ్ల పాలు
– నెలకు 4 లక్షల లీటర్లు పక్కదారి
– బియ్యం ఇచ్చేటప్పుడే ఈ–పాస్‌లో వేలిముద్రలు


అనంతపురం అర్బన్‌ : నీలి కిరోసిన్‌ను డీలర్లు భారీఎత్తున నల్లబజారుకు తరలిస్తున్నారు. జిల్లాలో నెలసరి దాదాపు నాలుగు లక్షల లీటర్లు పక్కదారి పడుతోంది. ఫలితంగా ఎంతోమంది పేదల ఇంట్లో పొయ్యి, దీపం వెలిగించాల్సిన కిరోసిన్‌.. కొందరు పెద్దోళ్ల ఇంట కాసులు కురిపిస్తోంది. కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే, మరికొందరు  బియ్యం ఇచ్చేటప్పుడే కిరోసిన్‌ కూడా పంపిణీ చేసినట్లు ఈ–పాస్‌లో కార్డుదారులతో వేలిముద్ర వేయించుకుంటున్నారు. కార్డుదారుల్లో కొందరు మొహమాటం కొద్దీ మిన్నకుండిపోతున్నారు. మరికొందరు సాంకేతిక కారణాలో, మరొకటో చెప్పి బియ్యం కూడా ఇవ్వకుండా ఎగ్గొడతారని భయపడుతున్నారు. శింగనమల మండల పరిధిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది.

    జిల్లాలో బీపీఎల్‌ కార్డులు 11.28 లక్షలు ఉన్నాయి. వీటికి సంబంధించి నెలకు 14.85 లక్షల లీటర్ల కిరోసిన్‌ సరఫరా అవుతోంది. 23 మంది హోల్‌సేల్‌ డీలర్లు కిరోసిన్‌ను చౌక దుకాణాలకు చేరవేస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో గ్యాస్‌ కనెక్షన్‌ లేని కార్డుదారులకు నెలకు నాలుగు లీటర్లు, ఉన్నవారికి లీటరు చొప్పున కిరోసిన్‌ ఇస్తున్నారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారికి రెండు లీటర్లు, ఉన్నవారికి ఒక లీటరు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చౌకదుకాణాల డీలర్లు, హోల్‌సేల్‌ yీ లర్లు కుమ్మకై నెలకు నాలుగు లక్షల లీటర్లకు పైగానే పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం.

మొత్తానికే ఎగనామం
కొందరు డీలర్లు కార్డుదారులకు కిరోసిన్‌ పంపిణీ చేయకుండా మొత్తానికే ఎగనామం పెడుతున్నారు. ఇంకొందరు తక్కువ కొలతలతో వేస్తున్నారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని కట్టకిందపల్లి గ్రామంలో  డీలర్‌ జూన్, జులైలో కిరోసిన్‌ పంపిణీ చేయలేదని కార్డుదారులు చెప్పారు. శింగనమల మండల కేంద్రంలోనే కాకుండా ఆ మండలంలోని కొన్ని గ్రామాల్లో  మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నట్లు సమాచారం. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు బియ్యం ఇస్తారు. ఆ తరువాత కిరోసిన్‌ పంపిణీ ప్రారంభిస్తారు.  బియ్యం కోసం కార్డుదారులు వచ్చిన సమయంలోనే  కిరోసిన్‌ పంపిణీ చేసినట్లుగా ఈ–పాస్‌ యంత్రంలో వేలిముద్ర వేయించుకుంటున్నట్లు శింగనమల  పరిధిలోని కార్డుదారులు చెప్పారు. వీరికి  ఇవ్వాల్సిన కోటా కిరోసిన్‌ను హోల్‌సేల్‌ డీలర్‌తో ఒప్పందం చేసుకుని అటు నుంచి అటే నల్లబజారుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురిపై వేటేసినా మార్పు రాలేదు
గతంలో అనంతపురం రూరల్‌ పరిధిలో ముగ్గురు డీలర్లు కిరోసిన్‌ పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో కలెక్టర్‌ కోన శశిధర్‌ విచారణ చేయించారు. అక్రమాలు నిర్ధారణ కావడంతో ముగ్గురినీ సస్పెండ్‌ చేశారు.  ఈ వ్యవహారంలో తహశీల్దారును, సీఎస్‌డీటీని కూడా బాధ్యుల్ని చేశారు. తహశీల్దారును కొంతకాలం విధులకు దూరంగా ఉంచి, ఆ తర్వాత ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఇక సీఎస్‌డీటీని సస్పెండ్‌ చేశారు. అయినప్పటికీ  పరిస్థితిలో మార్పు రావడం రాలేదు. డీలర్లు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.

Advertisement
Advertisement