బోగస్‌ పట్టభద్రులు | Sakshi
Sakshi News home page

బోగస్‌ పట్టభద్రులు

Published Tue, Feb 14 2017 12:33 AM

bogus graduates

– ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీలో ‘పచ్చ’పాతం 
 
 బేతంచెర్లకు చెందిన శ్రీలక్ష్మి పదో తరగతి సర్టిఫికెట్‌ ఆధారంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరుగా నమోదు అయ్యేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఏ మాత్రం విచారణ చేయకుండానే ఆమె దరఖాస్తును ఆమోదించి ఓటు హక్కు కల్పించారు. ఇలాంటి బోగస్‌ పట్టభద్రులు జిల్లాలో కోకొల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి పట్టభద్రల నియోజకవర్గంలో బోగస్‌ ఓటర్లు కుప్పలు, తెప్పలుగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఓటర్లుగా నమోదు కావడానికి విధిగా డిగ్రీ, తత్సమాన పరీక్షలో 2013 అక్టోబర్‌లోపు ఉత్తీర్ణులయిన వారే అర్హులు. అయితే అధికారులు టీడీపీ నేతల మాయలో పడి పదవ తరగతి సర్టిఫికెట్లపైనే ఓటర్లుగా నమోదు చేశారంటే ఎంత గుడ్డిగా వ్యవహరించారో తెలుస్తోంది. బోగస్‌ ఓటర్లు తవ్వేకొద్ది వెలుగులోకి వస్తున్నారు. ఎలాంటి సర్టిíఫికెట్‌ లేకపోయినా కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా కూడా ఓటర్లను నమోదు చేయడం గమనార్హం. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రెవెన్యూ అధికారులు తుంగలో తొక్కి దేశం నేతల ఆధ్వర్యంలో బోగస్‌ ఓటర్లను అడ్డుగోలుగా నమోదు చేసి అభాసుపాలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల నమోదులో విధిగా డిగ్రీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. వీటిపై గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌ కూడా చేయించాలి. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి పరిశీలన చేయకుండా ఇష్టానుసారంగా బోగస్‌ పట్టభద్రులను ఓటర్లుగా గుర్తించి నవ్వులపాలు అయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే రెవెన్యూ అధికారుల పచ్చపాతం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఓటర్ల జాబితాలో బోగస్‌ పట్టభద్రుల నమోదుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది.
 

Advertisement
Advertisement