కలెక్టరేట్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

Published Thu, Nov 3 2016 1:19 AM

కలెక్టరేట్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

  • మెటల్‌ డిటెక్టర్‌ ఏర్పాటు
  • కలెక్టరేట్‌లోకి వాహనాలకు అనుమతి లేదు 
  • నెల్లూరు (పొగతోట) : ఐఏఎస్‌ అధికారులు, కలెక్టరేట్‌లకు ఉగ్రవాదులు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని స్పెషల్‌ బ్రాంచ్, ఇంటిలిజెన్స్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం, రెండు నెలల కిందట  జిల్లా కోర్టులో ప్రాంగణంలో బాంబు పేలిన ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం కలెక్టరేట్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో ప్రవేశ ద్వారం వద్ద మెటల్‌ డిటెక్టర్‌ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని పరిశీలించి పంపుతున్నారు. ప్రతి రోజు మెటల్‌ డిటెక్టర్‌తో పరిశీలించిన తర్వాతనే కలెక్టరేట్‌లోకి అనుమతి ఇస్తారు. చాలా కాలంగా కలెక్టరేట్‌ అవరణ పార్కింగ్‌ ప్రదేశంగా మారిపోయింది. జిల్లా అధికారుల వాహనాలు, కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగుల వాహనాలు కాకుండా ఇతరుల వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. కలెక్టరేట్‌ చుట్టుపక్కల నివశించే వారు, వ్యాపారులు వారి వాహనాలను కలెక్టరేట్‌లో పార్కింగ్‌ చేస్తున్నారు. రాత్రి సమయంలో ప్రైవేట్‌ వ్యక్తులు వారి కార్లను తీసుకువచ్చి కలెక్టరేట్‌లో పార్కింగ్‌ చేస్తున్నారు. వాహనాల్లో బాంబులు పెట్టే అవకాశం ఉండటంతో గురువారం నుంచి వాహనాలను కలెక్టరేట్‌లోకి ప్రవేశించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల వాహనాలు కూడా గోల్డెన్‌ జూబ్లీ హాలు ప్రాంతంలో పార్కింగ్‌ చేసే అవకాశం ఉంది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మెటల్‌ డిటెక్టర్‌ను కలెక్టర్‌ ఆర్‌. ముత్యాలరాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఏ మహమ్మద్‌ఇంతియాజ్‌ పరిశీలించారు.
     
     

Advertisement
Advertisement