విజృంభిస్తున్న జ్వరాలు | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న జ్వరాలు

Published Tue, Sep 20 2016 9:35 PM

విజృంభిస్తున్న జ్వరాలు

 జిల్లాలో పిట్టల్లా రాలుతున్న ప్రజలు
డెంగీతో ఒక చిన్నారి, మలేరియాతో మహిళ మృతి
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ

 
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నా.. వైద్య శాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా చర్యలు కనిపించడం లేదు. తాజాగా డెంగీతో బాధపడుతూ ఒక చిన్నారి, ఓ మహిళ మృతి చెందారు.  

ప్రొద్దుటూరు టౌన్‌: జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఆస్పత్రి చూసినా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నా.. అధికారుల్లో చలనం కనిపించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా నాగేంద్రనగర్‌కు చెందిన 8 నెలల చిన్నారి ఎన్‌ నిపున్‌రెడ్డి డెంగీ జ్వరంతో కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు చిన్నారులతో పాటు పట్టణానికి చెందిన 15 మంది డెంగీతో బాధపడుతూ కర్నూలులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా మరణంతో ప్రొద్దుటూరు పట్టణంలో డెంగీ, విషజ్వరాలతో మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది.
వారం నుంచి చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది
నాగేంద్రనగర్‌కు చెందిన  శివమోహన్‌రెడ్డి, అరుణ దంపతుల సంతానం నిపున్‌రెడ్డి(8 నెలల). బాలుడికి ఈ నెల 12న జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రక్తకణాలు రోజు రోజుకు తగ్గి పోవడంతో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మొదటి రోజు 90 వేలు ఉన్న రక్త కణాలు ఒక్క సారిగా 30 వేలకు పడిపోయాయి. దీంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో చికిత్స విఫలమై సోమవారం రాత్రి మృతి చెందాడు. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.    
గతేడాది నాగేంద్రనగర్‌లో ఐదుగురు మృతి    
పట్టణంలో గత ఏడాది మొట్టమొదటి డెంగీ మరణం సంభవించింది నాగేంద్రనగర్‌లోనే. అప్పుడు అయిదుగురు ఈ ప్రాంత వాసులు డెంగీ, విషజ్వరాలతో మరణించారు. ఈ ప్రాంతంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement
Advertisement