వీఆర్‌ఓ ఫలితాల్లో పురుషుల హవా | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓ ఫలితాల్లో పురుషుల హవా

Published Sun, Feb 23 2014 1:29 AM

boys got succeed in vro results

ఫస్ట్ ర్యాంకు నుంచి వరుసగా 28 వరకూ వారివే..
విడుదలైన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఫలితాలు
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఈ నెల 2న జరిగిన గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయక (వీఆర్‌ఏ) అర్హత పరీక్ష ఫలితాలను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో పాటు ర్యాంకులను అధికారులు ప్రకటించారు. జిల్లాలో 72 వీఆర్‌ఓ పోస్టులకుగాను 59,385 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 46,807 మంది ఫలితాలు విడుదల కాగా.. 4,048 మంది అభ్యర్థుల పేర్లు తిరస్కరణ జాబితాలోకి వెళ్లాయి. అదేవిధంగా 152 వీఆర్‌ఏ పోస్టులకుగాను 5,179 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 4,197 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 3,858 మంది అభ్యర్థుల ఫలితాలు విడుదల చేసి.. 339 మంది అభ్యర్థుల పేర్లు తిరస్కరణ జాబితాలో చేర్చారు. ఎంపికైన 72 మంది అభ్యర్థుల మెరిట్ లిస్టును కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ అభ్యర్థులు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 24న కలెక్టరేట్‌లోని పరిపాలనాధికారికి పరిశీలన నిమిత్తం సమర్పించాలి. వీఆర్‌ఏలు సబ్‌కలెక్టర్ లేదా ఆర్డీఓ కార్యాలయాల్లో తమ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.
 
 పురుషులదే హవా..
 
 గ్రామ రెవెన్యూ అధికారి పరీక్ష ఫలితాల్లో పురుషుల హవా కనిపించింది. ఫస్ట్ ర్యాంకు మొదలు వరుసగా 28వ ర్యాంకు వరకు పురుషులే ఉన్నారు. కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మర్పల్లి వెంకటరమణారెడ్డి 95మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించగా, యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన గౌర కృష్ణ 4వ ర్యాంకు, ఆయనతో కలిసి పదోతరగతి చదివిన గునుగల్ గ్రామానికి చెందిన పి.సంధ్యారాణి 29వ ర్యాంకు, చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ 5వ ర్యాంకు, అలాగే గండేడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన బోయిని రవికాంత్ 8వ ర్యాంకు సాధించారు.
 
 గ్రూప్ వన్ ఉద్యోగం సాధిస్తా
 ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన నేను 2011 సంవత్సరం నుంచి ఎస్సై, తదితర పోటీ పరీక్షలకు సొంతంగా మెటీరియల్ తయారుచేసుకొని ప్రిపేర్ అవుతున్నాను. వీఆర్‌ఓ పరీక్షలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్ వన్ ఉద్యోగం కోసం పట్టుదలగా చదువుతున్నా, తప్పకుండా దాన్ని సాధిస్తా.
 
 కష్టానికి ఫలితం దక్కింది
 
 చిన్నపటినుండి కష్టపడి చదివిన చదువుకు ఫలితం దక్కింది. ఎన్నో ఒడిదొడుకుల మధ్య చదువుకుంటూ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నించాను. తాతయ్య నన్ను బాగా ప్రోత్సహించారు. వీఆర్‌ఓ పరీక్షలో 93మార్కులతో జిల్లాలో 8ర్యాంకు వచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవచేసే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. అమ్మానాన్నల కల కూడా నెరవేరింది.
 - బోయిని రవికాంత్, చౌదర్‌పల్లి, గండేడ్ మండలం
 
 ఐఏఎస్ సాధించడమే లక్ష్యం
 
 అమ్మానాన్న బౌరమ్మ, యాదయ్యలు వ్యవసాయ కూలీలు. కష్టపడి మమ్మల్ని చదివించారు. అన్న నర్సింహకు కొద్ది నెలల క్రితమే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. మా పెదనాన్న కొడుకు వెంకటేష్ ప్రస్తుతం ఎస్సైగా మహబూబ్‌నగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరు అన్నల స్ఫూర్తితో కష్టపడి వీఆర్‌ఓ పరీక్షకు ప్రిపేరయ్యాను. జిల్లాలో నాల్గో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. వచ్చిన ఉద్యోగం చేస్తూనే భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం.
 
 - గౌర కృష్ణ, గడ్డమల్లయ్యగూడ, యాచారం మండలం
 ఐఏఎస్ తప్పకుండా సాధిస్తా
 
 వీఆర్‌ఓ ఫలితాల్లో జిల్లాలో నాకు 29వ ర్యాంకు వచ్చిందని స్నేహితుల ద్వారా తెలిసి సంతోషం కలిగింది. నా విజయం వెనుక తల్లిదండ్రులు యాదమ్మ, భిక్షపతిగౌడ్‌ల కృషి ఎంతైనా ఉంది. వీఆర్‌ఓగా పనిచేస్తూనే అమ్మానాన్నల ఆశయం మేరకు ఐఏఎస్‌ను తప్పకుండా సాధిస్తా
 - పి. సంధ్యారాణి, గునుగల్, యాచారం మండలం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement