ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఒకరి మృతి

Published Tue, Aug 23 2016 9:30 PM

ఘటన స్థలంలో గాయపడ్డ  మారిముత్తు (63), పక్కనే రోధిస్తున్న బంధువులు

- మలుపు వద్ద అతివేగం వల్లే ఘటన
సాక్షి, తిరుమల: విధి వక్రీకరించింది. కుటుంబ సభ్యులతో కలసి దేవదేవుడిని దర్శించుకుందామని మంగళవారం తమిళనాడు నుండి ఓ వృద్ధుడు తిరుమలకు వచ్చారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పొలిమేరలోనే దుర్మణం చెందారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు సమీపంలోని పుల్లాచ్చికి చెందిన మారిముత్తు (63) మొత్తం ఐదు మంది కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చారు.   తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఏపీ29జెడ్‌ 0058 ఆర్టీసీ బస్సులో తిరుమలకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్‌కు చేరుకుంది. తర్వాత మలుపు వద్ద అతివేగంగా బస్సు తిరిగింది. దీంతో అక్కడే బస్సు మెట్లపై ఉన్న వృద్ధుడు అతివేగం వల్ల అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. తీవ్ర రక్తగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 అంబులెన్స్‌లో ఎక్కించి, అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మధ్యాహ్న భోజనానికి వెళ్లటంతో వైద్య చర్యలు ఆలస్యమయ్యాయి. తర్వాత అపోలో ప్రథమ చికిత్సా కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు. తిరుమలకు చేరుకున్నామన్న ఆనందంలో ఆ వృద్ధుడు బస్సు మెట్ల వరకు రావటం, మలుపు వద్ద అతివేగంతో బస్సును తిప్పటం వల్లే ఈ ఘటన జరిగింది. కళ్లముందే జరిగిన ఘటనతో బాధితుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. సంఘటన సమయంలో టూ టౌన్‌ ఎస్‌ఐ తులసీరామ్‌ స్టేషన్‌లోనే  ఉండటంతో క్షణాల్లోనే అక్కడికి చేరుకుని బాధితుడికి వైద్యం అందించే చర్యలు చేపట్టినా తుది శ్వాస విడవటం విషాదం. మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంతూరుకు తరలించే  ఏర్పాట్లు చేశారు.
 

Advertisement
Advertisement