సింగపూర్ సంస్థలకు దోచిపెడుతున్న బాబు | Sakshi
Sakshi News home page

సింగపూర్ సంస్థలకు దోచిపెడుతున్న బాబు

Published Sun, Dec 13 2015 9:07 AM

సింగపూర్ సంస్థలకు దోచిపెడుతున్న బాబు - Sakshi

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు
 
రాజమండ్రి: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ వ్యాపార సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. రాజమండ్రిలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు శనివారం హాజరైన రాఘవులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను బాబు సర్కారు సింగపూర్ సంస్థల చేతుల్లో పోస్తోందని, సుప్రీంకోర్టు తీర్పు, కేంద్ర ప్రభుత్వ సూత్రాలకు వ్యతిరేకంగా స్విస్ మెథడ్ అంటోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు గనులు, గ్యాస్‌లు, ఆస్తులను ధారాదత్తం చేస్తోందని దుయ్యబట్టారు.  అంగన్‌వాడీలకు వేతనాలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు సుమారు రూ.1,200 కోట్ల రాయితీలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
 
 కార్మికులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు, నిర్వాసితులకు సర్కారు ఏ రకమైన న్యాయం చేయడం లేదన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల కోసం ప్రభుత్వ యూనివర్సిటీలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని, వాటికి నిధులు కేటాయించకుండా మూసివేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. బందర్ ఓడరేవు, భోగాపురం ఎయిర్ పోర్టు కోసం రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా లక్షలాది ఎకరాలు లాక్కుని వారిని రోడ్డున పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement