800 కిలోల గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

800 కిలోల గంజాయి పట్టివేత

Published Fri, Aug 5 2016 10:47 PM

గంజాయిని పరిశీలిస్తున్న ఎస్సై నవీన్‌

పెనుబల్లి : డీసీఎం వ్యాన్‌లో ప్యాకింగ్‌ చేసిన గంజాయిని తరలిస్తుండగా పెనుబల్లి పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై పి.నవీన్, ట్రెయినీ ఎస్సై బి.పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో వీయంబంజర్‌ ప్రాథమిక పాఠశాల ఎదుట వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాన్‌ డ్రైవర్‌ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అనుమానం వచ్చి వ్యాన్‌ను తనిఖీ చేశారు. వ్యాన్‌ అడుగు భాగంలో గంజాయి బస్తాలను వేసి.. పైన సర్వే బాదులను పెట్టుకుని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నిస్తుండగానే పారిపోయే ప్రయత్నం చేయగా.. వెంబడించి పట్టుకున్నారు. అనంతరం డీసీఎం వ్యాన్‌ను వీయంబంజర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. సీఐ సీహెచ్‌.రాజిరెడ్డి ఆధ్వర్యంలో వ్యాన్‌లోని కర్రలను తొలగించి.. వాటి కింద 28 సంచుల్లో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 800 కిలోల గంజాయి విలువ సుమారు రూ.16లక్షలు ఉంటుందని అంచనా. గుడివాడకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ పక్కిరి ప్రసాద్, క్లీనర్‌ అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గంజాయిని ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని కోటనందూరు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. పూర్తి వివరాలను శనివారం వెల్లడించనున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement