నమ్మకం ఓడింది! | Sakshi
Sakshi News home page

నమ్మకం ఓడింది!

Published Tue, Oct 27 2015 7:51 PM

బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ - Sakshi

మునగపాక: ఓ కారు యజమాని డ్రైవర్‌పై పెట్టుకున్న నమ్మకం ఓడింది. మూడేళ్లు ఎంతో నమ్మకంగా ఉంటూ.. చివరికి డబ్బుపై దురాశతో యజమానిని నట్టేటముంచాడు ఆ డ్రైవర్. సుమారు రూ. 12.75 లక్షలు, కారుతో యజమాని కళ్లుగప్పి పరారయ్యాడు. మునకపాక మండలం వెంకటాపురం వద్ద సోమవారం జరిగిన సంఘటన వివరాలను అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం విలేకరులకు వెల్లడించారు.

విశాఖపట్నం మధురవాడలోని రెవెన్యూ కాలనీలో నివాసం ఉంటున్న కనగాల శ్రీనివాసరావు వృత్తిరీత్యా కాంట్రాక్టర్. పలు కంపెనీల్లో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మునగపాక మండలం వెంకటాపురంలోని ఆర్‌హెచ్‌ఎల్ క్లాసిల్ కంపెనీలో కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు సోమవారం ఉదయం ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. సమీపంలోని కార్పొరేషన్ బ్యాంక్లో రూ. 5లక్షలు విత్‌డ్రా చేశారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న తన స్నేహితుడు జేవీ ప్రసాద్‌తో కలిసి ద్వారకానగర్‌లోని కార్పొరేషన్ బ్యాంక్‌లో మరో రూ.5లక్షలు విత్‌డ్రా చేశాడు. తన వద్ద ఉన్న రూ.2.75లక్షలతో కలిపి  మొత్తం రూ.12.75 లక్షలతో పయనమయ్యారు.

తనకు నమ్మకస్తుడైన కారు డ్రైవర్ పరిమి గాంధీతో కలిసి మధ్యాహ్నం 12.30గంటలకు కంపెనీ వద్దకు చేరుకున్నారు. కారులో డబ్బులు, ల్యాప్‌టాప్‌తోపాటు సర్వేకు సంబంధించిన సామగ్రి ఉంచి, జాగ్రత్తగా చూడమని డ్రైవర్‌కు చెప్పి లోపలికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు వ చ్చి చూసేసరికి నగదుతో ఉన్న కారు కనిపించకపోవడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తెరుకొని డ్రైవర్‌పై మునకపాక పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పురుషోత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట అనకాపల్లి రూరల్ సీఐప్రసాద్ ఉన్నారు.

నిందితుడిని పట్టుకుంటాం
డబ్బుతో పరారైన గాంధీని పట్టుకుంటామని డీఎస్పీ పురుషోత్తం, క్రైం డీఎస్పీ రవివర్మ తెలిపారు. నమ్మశక్యంగా ఉంటూ డబ్బు, కారుతో పరారైన వ్యక్తికోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. చెక్‌పోస్టులతోపాటు ప్రధాన సెంటర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement